సూపర్‌–12కు అర్హత పొందని లంక

Afghanistan qualify for Super 12s at Sri Lanka expense - Sakshi

దుబాయ్‌: మాజీ చాంపియన్‌ శ్రీలంక టి20 ప్రపంచకప్‌ సూపర్‌–12కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. తక్కువ ర్యాంకు కారణంగా లంకతో పాటు బంగ్లాదేశ్‌ కూడా వచ్చే ఏడాది జరిగే మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత పొందలేదు. దీంతో ఈ రెండు జట్లు గ్రూప్‌ దశలో మిగతా ఆరు జట్లతో పోటీపడాల్సి ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం వెల్లడించింది. టాప్‌ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌తో పాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌ ఈ ఎనిమిది జట్లు సూపర్‌–12కు నేరుగా అర్హతపొందాయి.

మరో నాలుగు జట్లు గ్రూప్‌ దశ ద్వారా అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు గ్రూప్, ప్రధాన టోర్నీ జరుగుతుంది. అంతకంటే ముందు ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ నిర్వహిస్తారు. ఇందులో రాణించిన ఆరు జట్లు గ్రూప్‌ దశకు అర్హత పొందుతాయి. ఒకసారి టైటిల్‌ నెగ్గి... మూడుసార్లు ఫైనలిస్టుగా నిలిచిన లంక నేరుగా అర్హత పొందలేకపోవడం పట్ల కెప్టెన్‌ మలింగ విచారం వ్యక్తం చేశాడు. అయితే గ్రూప్‌ దశలో సత్తాచాటడం ద్వారా సూపర్‌–12 బెర్త్‌ సాధిస్తామన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top