ఆదిత్య ‘డబుల్‌’ ధమాకా

Aditya gets Two More Titles in carrom tournament - Sakshi

 అపూర్వకు సింగిల్స్‌ టైటిల్‌

 రాష్ట్ర ర్యాంకింగ్‌ క్యారమ్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ క్యారమ్‌ టోర్నమెంట్‌లో ఎస్‌. ఆదిత్య రెండు టైటిళ్లతో సత్తా చాటాడు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌ నగర్‌ సంక్షేమ సంఘం స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆదిత్య సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌పోరులో ఎస్‌. ఆదిత్య (వి–10) 25–16, 25–5తో మాజీ ప్రపంచ చాంపియన్‌ కె. శ్రీనివాస్‌ (ఐఓసీఎల్‌)పై వరుస సెట్లలో గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఆదిత్య 25–11, 1–25, 20–18తో హకీమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)పై, కె. శ్రీనివాస్‌ 25–11, 12–25, 25–10తో మొహమ్మద్‌ అహ్మద్‌ (హెచ్‌ఎంసీసీ)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆదిత్య– వి. శివానంద రెడ్డి ద్వయం 21–7, 20–10తో ఎస్‌కే వసీమ్‌– మొహమ్మద్‌ జఫర్‌ జోడీని ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఆదిత్య–శివానంద జంట 0–25, 25–21, 25–13తో కె. శ్రీనివాస్‌– బాసిల్‌ ఫిలిప్స్‌ జోడీపై, జఫర్‌– వసీమ్‌ జంట 25–6, 17–25, 25–12తో మొహమ్మద్‌ అహ్మద్‌– ఎస్‌కే మొహమ్మద్‌ జోడీపై గెలుపొందాయి.  

మరోవైపు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ప్రపంచ చాంపియన్‌ అపూర్వ గెలుచుకుంది. ఫైనల్లో అపూర్వ (ఎల్‌ఐసీ) 20–16, 24–4తో సి. కార్తీక వర్ష (ఎన్‌ఏఎస్‌ఆర్‌)పై విజయం సాధించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా క్యారమ్‌ సంఘం (హెచ్‌డీసీఏ) అధ్యక్షురాలు గద్వాల్‌ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్యారమ్‌ సంఘం (క్యాట్స్‌) అధ్యక్షుడు బీకే హరినాథ్, కార్యదర్శి ఎస్‌. మదన్‌ రాజ్, హెచ్‌డీసీఏ ఉపాధ్యక్షులు నర్సింహారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌. శోభన్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top