ఆర్థికంగా నష్టపోతాం! 

Aaron Finch Speaks About Cancellation Of IPL 2020 - Sakshi

ఐపీఎల్‌ రద్దుపై ఫించ్‌ వ్యాఖ్య  

మెల్‌బోర్న్‌: కరోనా (కోవిడ్‌–19) కారణంగా ఐపీఎల్,  ఆస్ట్రేలియా జట్టు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోతే తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్‌ ఫించ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తామంతా కలిసి కట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటామన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) గతంలో నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వగా... తాజా పరిస్థితుల్లో దానిని పునఃసమీక్షించే అవకాశం ఉందని బాంబు పేల్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం విదేశీ ప్రయాణాలపై చాలా కఠినంగా ఉంది. దాంతో ఐపీఎల్‌ ఏప్రిల్‌ 15న ఆరంభమైనా ఆసీస్‌ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

సీఏ ఇప్పటికే తాము ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేసుకుంది. దాంతో ఇది ఆటగాళ్ల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సీఏ తాము నిర్వహించిన సిరీస్‌ల ద్వారా వచ్చే రాబడి లోంచి వాటాల (రెవెన్యూ షేర్‌ మోడల్‌) రూపంలో ఆటగాళ్లకు చెల్లిస్తుంది. ఇప్పుడు సిరీస్‌లు జరగనందువల్ల తమకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఫించ్‌ పేర్కొన్నాడు. ఇటువంటి సమయంలోనే ఐపీఎల్‌ కూడా జరగకపోతే మా పరిస్థితి మరింతగా దిగజారుతుందని అన్నాడు. దాదాపు 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ ప్రాంచైజీలతో కాంట్రాక్టు కలిగి ఉన్నారు. అయితే ఈ పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానన్న ఫించ్‌... ఎప్పుడనేది మాత్రం తాను ప్రస్తుతం చెప్పలేనన్నాడు. ‘మనం ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులను చూసి ఉండం. ప్రయాణాలపై కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు వారాల్లో తిరిగి మామూలు స్థితి ఏర్పడవచ్చు. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ వైరస్‌ కట్టడికి అందరూ తమ వంతు సాయం చేయాలి.’అని ఫించ్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top