శ్రీవత్స, మహక్ జైన్‌లకు టాప్ సీడింగ్ | Sakshi
Sakshi News home page

శ్రీవత్స, మహక్ జైన్‌లకు టాప్ సీడింగ్

Published Sun, Aug 3 2014 12:06 AM

4 Asian junior event

4 నుంచి ఆసియా జూనియర్స్ ఈవెంట్
 రాష్ట్రంలో తొలిసారి ఇండోర్ టెన్నిస్
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఇండోర్ టెన్నిస్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. నగర శివారులోని లియోనియా రిసార్ట్స్‌లో అధునాతన ప్రమాణాలతో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టుల్లో ఇండోర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం నుంచి జరిగే ఆసియా జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్(అండర్-14)లో... మొత్తం పది దేశాల క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
 
 ఈ టోర్నీలో హైదరాబాదీ క్రీడాకారులు శ్రీవత్స రాతకొండ, మహక్ జైన్‌లకు టాప్ సీడింగ్ కేటాయించారు. బాలికల విభాగంలో మహక్ జైన్‌తో పాటు తెలుగమ్మాయిలు సాయిదేదీప్య, శివాని అమినేనిలు వరుసగా రెండు, మూడో సీడ్‌లుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రానికి చెందిన మరో అమ్మాయి శ్రీవల్లి రష్మికకు ఏడో సీడింగ్ దక్కింది. బాలుర సింగిల్స్‌లో శ్రీవత్స టాప్ సీడ్‌కాగా, మాచెర్ల తీర్థ శశాంక్ 8వ సీడ్‌గా పోటీపడతాడు.
 
 16 మంది క్వాలిఫయర్లు
 బాలబాలికల విభాగాల్లో మొత్తం 128 మంది క్రీడాకారులు మెయిన్ డ్రా ఈవెంట్‌లో పాల్గొంటారు. వీరిలో 16 మంది క్వాలిఫయర్లుంటారు. క్వాలిఫయింగ్ ఈవెంట్ ద్వారా 8 మంది చొప్పున బాలబాలికలు మెయిన్ డ్రా పోటీలకు అర్హత సంపాదిస్తారు. ఈ నెల 4న మొదలయ్యే ఈ టోర్నీ 9న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సోమవారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ లాన్ టెన్నిస్ సంఘం (టీఎల్‌టీఏ) సౌజన్యంతో డీఆర్‌సీ స్పోర్ట్స్ ఫౌండేషన్, ఫినిక్స్ లైవ్ సంస్థలు సంయుక్తంగా ఈ టోర్నీని
 నిర్వహిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement