2021లో... టోక్యో 2020 

2020 Tokyo Olympics Postponed To 2021 - Sakshi

సంవత్సరం పాటు ఒలింపిక్స్‌ క్రీడలు వాయిదా

వచ్చే ఏడాది ఇదే తేదీల్లో జరిగే అవకాశం

ఐఓసీ, జపాన్‌ ప్రభుత్వ సమష్టి నిర్ణయం

ఊపిరి పీల్చుకున్న క్రీడా ప్రపంచం   

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలైలోగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), జపాన్‌ ప్రభుత్వం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఒలింపిక్స్‌ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని నేను ప్రతిపాదించాను.

ఐఓసీ అధ్యక్షుడు దానికి వంద శాతం అంగీకరిస్తున్నట్లు సమాధానమిచ్చారు’ అని జపాన్‌ ప్రధాని షింజో అబె ప్రకటించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు వారాలు కావాలని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ఐఓసీ కూడా చివరకు సభ్య దేశాల ఒత్తిడితో తలొగ్గక తప్పలేదు. ఇప్పుడున్న షెడ్యూల్‌ ప్రకారం జరిగితే తాము కూడా పాల్గొనలేమంటూ ఒక్కో సభ్య దేశం ప్రకటిస్తుండటంతో ఐఓసీకి వాయిదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 2021లో కచ్చితమైన తేదీలు ప్రకటించకపోయినా... 2020 టోక్యో ఒలింపిక్స్‌  కోసం అనుకున్న తేదీల్లోపే (జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు) మెగా ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది.  

వాయిదా మొదటిసారి మాత్రమే! 
1896లో తొలిసారి ఒలింపిక్స్‌ జరిగాయి. అప్ప టి నుంచి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించకుండా వాయిదా వేయడం ఇదే తొలిసారి. గతంలో 3 సార్లు ప్రపంచ యుద్ధాల సమయంలో అసలు ఒలింపిక్స్‌ జరగనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను రద్దు చేశారు.

ఐఓసీ, జపాన్‌ ఒలింపిక్‌ నిర్వహణ కమిటీ సంయుక్త ప్రకటన  
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 కారణంగా నెలకొని ఉన్న పరిస్థితిపై జపాన్‌ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడాకారులు, వారి సన్నాహాలపై దీని కారణంగా పడుతున్న ప్రభావంపై కూడా వారు చర్చించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనలు  పరిగణనలోకి తీసుకున్నాం. అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 32వ ఒలింపిక్‌ క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయించాం. 2020 ముగిసిన తర్వాత 2021 వేసవిలోగా వీటిని నిర్వహిస్తాం’ అని ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు.

ఏడాదిని మార్చడం లేదు! 
టోక్యో ఒలింపిక్స్‌ 2021కు వాయిదా పడినా... అధికారిక నిర్వహణలో మాత్రం అదే సంవత్సరాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగినప్పుడు కూడా ఇవి ‘టోక్యో 2020’ పేరుతోనే జరుగుతాయి. టోక్యో 2020 గేమ్స్‌ లోగోలతో ఇప్పటికే సిద్ధం చేసిన టీ షర్ట్‌లు, ఇతర జ్ఞాపికలతో కూడిన  ‘మర్కండైజ్‌’ను అమ్ముకునే అవకాశం వృథా చేయకూడదనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

జ్యోతి కూడా జపాన్‌లోనే... 
ఒలింపిక్స్‌ వాయిదా పడినా జ్యోతి మాత్రం ఏడాది పాటు జపాన్‌లోనే ఉంటుంది. ‘ప్రపంచం మొత్తం తీవ్ర విషాదంలో ఉన్న ఇలాంటి సమయంలో టోక్యో నగరం భవిష్యత్తు ఆశలకు సంకేతంలా ఉండాలని మేం భావిస్తున్నాం. కష్టకాలంలో ఒలింపిక్‌ జ్యోతి కూడా చీకటిలో చిరుదివ్వెలాంటిది. అందుకే ఒలింపిక్‌ జ్యోతిని టోక్యోలోనే ఉంచాలని నిర్ణయించాం’ అని కమిటీ ప్రకటించింది. అయితే రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన టార్చ్‌ రిలేను మాత్రం నిలిపివేశారు.

నష్టం ఎంత వరకు?
కరోనా కారణంగా ఆర్థికపరంగా ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్న జపాన్‌పై ఒలింపిక్‌ క్రీడల వాయిదా వల్ల మరింత భారం పడనుంది. ఈ గేమ్స్‌ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ పర్యాటకులు తదితర అంశాలపై వెంటనే దెబ్బ పడే అవకాశం ఉంది. రద్దు కాకపోవడం కొంత ఊరట కలిగించినా... ఒక మెగా ఈవెంట్‌ ఏడాది వాయిదా అంటే అన్ని లెక్కలు తారుమారయినట్లే! ఒలింపిక్స్‌కు సంబంధించి దాదాపు 78 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటే 45 లక్షల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఒలింపిక్‌ నిర్వహణ ఖర్చు గురించి 2019 చివరి నాటికి నిర్వాహకులు అంచనా వేసిన వ్యయం 12.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 96 వేల కోట్లు).

గేమ్స్‌ను చూసేందుకు వచ్చే విదేశీ అభిమానుల ద్వారా సుమారు 2.28 బిలియన్‌ డాలర్లు (రూ. 17 వేల కోట్లు) ఆదాయాన్ని జపాన్‌ ఆశించింది. జపాన్‌ దేశానికే చెందిన కంపెనీలు 3.3 బిలియన్‌ డాలర్లు (రూ. 25 వేల కోట్లు) స్పాన్సర్‌షిప్‌ ఇస్తున్నాయి. ఇదంతా నిర్వాహక కమిటీకి దక్కేవే. వీటితో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలతో భారీ మొత్తాలకు ఒప్పందాలు జరిగాయి. మొత్తంగా వాయిదా కారణంగా మరో 6 బిలియన్‌ డాలర్ల (రూ. 46 వేల కోట్లు) వరకు జపాన్‌కు, నిర్వాహక కమిటీకి నష్టం జరగవచ్చని ఒక అంచనా.

అథ్లెట్లకు ఊరట: ఐఓఏ  
‘ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలన్న ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది మన క్రీడాకారులకు ఊరటనిస్తుంది. కరోనా ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాక్టీస్‌ చేయాల్సి రావడం, రాబోయే నాలుగు నెలల కోసం కఠినంగా శ్రమించాల్సి ఉండటం మన అథ్లెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఇప్పుడు వారికి ఆ బెంగ లేదు. రాబోయే ఏడాది కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో, ఏమేం చేయాలో అనేది అంతా చక్కబడిన తర్వాత భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) జాతీయ క్రీడా సమాఖ్యలతో చర్చిస్తుంది. ప్రస్తుతానికి మన క్రీడాకారుల ఆరోగ్యమే మనకు ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకొని వారంతా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా’ 
–రాజీవ్‌ మెహతా, ప్రధాన కార్యదర్శి, ఐఓఏ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top