మా నాన్న ఏకపత్నీ వ్రతుడు

Simbu lashes out at people who mock his father - Sakshi

సాక్షి సినిమా:  మా నాన్న ఏకపత్నీవ్రతుడు అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటుడు శింబు. ఈయన తండ్రి సీనియర్‌ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్‌. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాదు రాజకీయనాయకుడు కూడా. ప్రాసలో పంచ్‌ డైలాగ్స్‌ చెప్పడంతో దిట్ట. అయినా ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. టీఆర్‌ డైలాగులను, ఆయన స్టైల్స్‌ను సినిమాల్లోనే కాకుండా బయట కూడా పేరడీ చేస్తుంటారు. అయితే ఇలా తన తండ్రిని పరిహాసం చేసేవారిపై ఆయన కొడుకు, సంచలన నటుడు శింబు దండెత్తారు. ఇటీవల ఒక టీవీ చానల్‌లో అతిథులుగా టీఆర్, ఆయన కొడుకు శింబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శింబు తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా ఉన్నతుడని పేర్కొన్నారు. ఆయనలో చాలా ప్రతిభ ఉందన్నారు. అలాంటి వ్యక్తిపై కొందరు సెటైర్స్‌ వేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నోటితోనే సంగీత బాణీలు కడతారని, దాన్ని కొందరు పరిహాసం చేస్తుంటారని, అదే విధంగా తన తల జుత్తును ఎగరేసే స్టైల్‌ను ఎగతాళి చేస్తుంటారని అన్నారు. అలా చేయడం మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఇప్పటికీ సూపర్‌గా డాన్స్‌ చేస్తారని, అలా మీరు 20 ఏళ్ల వయసులో కూడా చేయలేరని అన్నారు. ఏ అమ్మాయిని చూసినా మీకు ఏదో భావం కలుగుతుందని, తన తండ్రి మాత్రం ఏకపత్నీవ్రతుడని పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా చెప్పాలంటే సెటైర్లు వేసే వారంతా ప్రతిభలేనివారేనని అన్నారు. తన తండ్రి ప్రతిభ అంగీకరించి గౌరవించేవారినే తాను గౌరవిస్తానని శింబు ఆవేశంగా మాట్లాడారు. ఆయన మాటలకు అదే వేదికపై ఉన్న టీ.రాజేందర్‌ ఆనంద బాష్పాలు రాల్చారు.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top