అగ్గిపెట్టె తిరిగివ్వకపోతే చర్యలు తీసుకోబడును!

 A Letter From UP Engineer, Who Wanted His Matchbox Back, Has Set The Internet On Fire - Sakshi

యూపీ విద్యుత్‌ ఇంజనీర్‌ లేఖ

సోషల్‌ మీడియాలో వైరల్‌

లక్నో : అగ్గిపెట్టె, లైటర్‌ ఎవరన్న తీసుకుంటే అడుగుతాం.. ఇస్తే తీసుకుంటాం లేకుంటే లైట్‌ తీసుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్‌ లైట్‌ తీసుకోలేదు. అగ్గిపెట్టె తిరిగివ్వాలని ఏకంగా లెటరే రాశారు. అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చర్యలు తీసుకోబడునని కూడా ఆ లేఖలో  పేర్కొన్నాడు. ఇప్పడు ఈ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మొరదాబాద్‌ ఎలక్ట్రిసిటీ అర్భన్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసే సుశీల్‌ కుమార్‌ ఆఫీసులో ఓ ఉద్యోగికి అగ్గిపెట్టె ఇచ్చారు. ఆ సదరు వ్యక్తి తిరిగివ్వకపోవడంతో ఈ నెల 1న ఓ లేఖ రాశాడు. ‘ గత జనవరి 23న మీకు ఇచ్చిన అగ్గిపెట్టె తిరిగివ్వకపోవడం’ విషయంగా పేర్కొన్నారు. ‘ఆఫీస్‌లో దోమల రిఫిలెంట్‌ కాయిల్స్‌ కాల్చేందుకు అగ్గిపెట్టె తీసుకున్నారు. అందులో సుమారు 19 పుల్లలున్నాయి. అగ్గిపెట్టె తీసుకొని వారం గడుస్తున్న మీరు తిరిగివ్వలేదు. దీంతో ఆఫీస్‌లోని ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళలో వారు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లోపు అగ్గిపెట్టెను తిరిగివ్వవలెను. ఒక వేళ ఇవ్వనిచో మీపై  చర్యలు తీసుకోబడును’ అని ఆఫీస్‌ అధికారిక స్టాంప్‌తో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూపీ ఎస్పీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చెప్పండి దర్యాప్తు చేస్తామని’  వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

అయితే సుశీల్‌ కుమార్‌ మాత్రం ఉద్యోగంలో కొత్తగా చేరిన కంప్యూటర్‌ ఆపరేటర్‌కు లెటర్‌ ఫార్మట్‌ తెలియడం కోసం అలా రాసానని స్పష్టం చేశారు. సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ సైతం ఇది వాస్తవమేనన్నాడు. తన మిత్రులు కూడా ఇదే విషయంపై పదేపదే ఫొన్‌ చేస్తుండగా వాట్సప్‌లో పంపించనాని అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందన్నాడు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top