‘పుంజు’కుంటున్నాయ్‌

high court says cock fights crime in pongal festival - Sakshi

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : సంక్రాంతి సమీపిస్తోంది. సంబరాల మాటున ఇప్పటికే చాటుమాటున కోడి పందేలు మొదలయ్యాయి. భోగి మొదలుకుని కనుమ వరకు భారీఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కోళ్లను బరిలోకి దింపేందుకు నేతలు, పందేలరాయుళ్లు సై అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, పందేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు ఎప్పటిలా గంభీరంగా ప్రకటిస్తున్నారు. రాజకీయ నేతలు రంగంలోకి దిగుతుండటంతో పోలీస్‌ ప్రకటనలు అమలవుతాయా లేక తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోతాయా అనేది త్వరలోనే తేలనుంది.

తీరప్రాంతాలే వేదికగా..
కోడి పందేలకు తీర ప్రాంతాలను వేదికగా చేసుకుంటున్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో పందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊటుకూరు పంచాయతీ పరిధిలో గత ఏడాది ఆగిన పందేలను ఈసారి కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు, జొన్నవాడ పెన్నా నదిలో ఇప్పటికే చాటుమాటుగా పందేలను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో పందేలు నిర్వహించి, పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. సంగం మండలం దువ్వూరు, మక్తాపురం ప్రాంతాల్లో ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు ప్రాంతంలోనే గతంలో కోడిపందేలు వేసేవారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి మరీ పందేలు నిర్వహించేవారు. ఈసారి పందేలు వేసే బరులు మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

పుంజులకు డిమాండ్‌
బుచ్చిరెడ్డిపాళెంలో పందెం పుంజులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కొందరు బాదం, పిస్తా, జీడిపప్పుతో కూడిన పౌష్టికాహారం అందించి మరీ వాటిని పెంచుతున్నారు. కొందరైతే పుంజులకు మద్యం సైతం తాగిస్తున్నారు. బయట ప్రాంతాల వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ ఏర్పడటంతో పందెం కోళ్ల ధరలు వేలాది రూపాయలు పలుకుతున్నాయి.

రూ.వంద నుంచి లక్షల్లో..
దామరమడుగు పెన్నా నదిలో సుదూరంగా ఇప్పటికే కోడి పందేలు వేస్తున్నారు. రూ.వంద నుంచి రూ.లక్షల పందెం కడుతున్నారు. ఇక్కడి బరుల్లో ప్రస్తుతం 10 నుంచి 20 మంది పాల్గొంటుండగా.. సంక్రాంతి నాటికి వందలాది మందితో జరిగే అవకాశం ఉంది. 

హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా!
కోడి పందేలు నిర్వహించడం నేరమని హైకోర్టు నిషేధం విధించింది. ఇవి జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు సైతం వీటిని జరగనివ్వబోమని చెబుతున్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్‌ యాక్ట్‌ 1960, ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ 1974 ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే, చివరి వరకు ఈ మాటపై నిలబడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆధ్వర్యంలో కోడిపందేలకు చెక్‌ పడుతుందని పలువురు భావిస్తున్నారు.  

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top