చిత్తూరు: ఫ్యాను ప్రభంజనం

YSRCP Won Chittoor Seats - Sakshi

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ సృష్టించిన సునామీకి జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్‌ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైఎస్సార్‌సీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగించింది. గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్ల లెక్కింపుతో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈవీఎంల లెక్కింపు మొదలు కాగానే రౌండ్‌ రౌండ్‌కు వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్లింది. మూడు, నాలుగో రౌండ్లు పూర్తయ్యే సరికి ఆ పార్టీ అభ్యర్థులు సమీప టీడీపీ అభ్యర్థులకు అందనంత దూరంలోకి మెజారిటీ వెళ్లిపోయింది.

బాబుకు భంగపాటు
చంద్రబాబు దుర్మార్గ పాలనలో ఐదేళ్లు ప్రత్యక్ష నరకం అనుభవించిన జిల్లా ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు నియోజకవర్గంలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆయన మరదలు అనీషా రెడ్డి పుంగనూరులో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. దొమ్మలపాటి రమేష్‌ మదనపల్లిలో, శంకర్‌ తంబళ్లపల్లిలో, పూతలపట్టులో లలితాథామస్, చంద్రగిరిలో పులివర్తి నాని, నగరిలో గాలి భానుప్రకాష్, గంగాధర నెల్లూరులో హరికృష్ణ, సత్యవేడులో జేడీ రాజశేఖర్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతిలో సుగుణమ్మ, చిత్తూరులో ఏఎస్‌ మనోహర్‌ పరాభవాన్ని చవిచూశారు. సొంత జిల్లాలో చంద్రబాబునాయుడుకు భంగపాటు ఎదురైంది. చంద్రబాబుకు చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన కుప్పం లో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు.

వైఎస్సార్‌సీపీ విజయదరహాసం
జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైఎస్సార్‌ సీపీ పట్టు నిలుపుకుంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరులో కళత్తూరు నారాయణస్వామి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరిలో ఆర్‌కే రోజా వాళ్ల స్థానాలను నిలబెట్టుకున్నారు. మదనపల్లె నుంచి నవాబ్‌ బాషా, పలమనేరు నుంచి వెంకటేగౌడ, పూతలపట్టు నుంచి బాబు గెలిచి గత ఎన్నికల్లో గెలిచిన 8 స్థానాలు పదిలం చేశారు. తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి విజయం సాధించారు.

తొలిసారి విజేతలు
సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పలమనేరు నుంచి వెంకటే గౌడ, చిత్తూరు నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు, పూతలపట్టు నుంచి ఎం.ఎస్‌. బాబు, మదనపల్లె నుంచి నవాజ్‌ బాషా తొలిసారి గెలిచి అసెంబ్లీ మెట్లెక్కనున్నారు.

జగన్‌ వెంటే జనం
జిల్లాలో జనం జగన్‌ వెంటే అని మరోసారి నిరూపితమైంది. ఏకంగా 13 సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పదేళ్ల నిరీక్షణ, అడుగడుగునా అవమానాలు, వేధింపులు తట్టుకుని సాధించిన విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. 1994లో ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో టీడీపీ 15 స్థానాలకు గాను 14 సాధించి విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత ఎవరికీ సాధ్యం కాదనుకున్న ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రస్పుటమయ్యాయి. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌సీపీ అపూర్వ విజయాన్ని నమోదు చేసి చరిత్రలో నిలిచిపోయింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top