చంద్రబాబు దీక్షకు దిగటం హాస్యాస్పదం.. | YSRCP MP Varaprasad Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దీక్షకు దిగటం హాస్యాస్పదం..

Apr 19 2018 2:23 PM | Updated on Aug 14 2018 11:26 AM

YSRCP MP Varaprasad Fires on CM Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఆయన దీక్ష చేపడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కాలరాసి.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదని  వరప్రసాద్‌ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రంతో సక్యతగా ఉంటూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

పీఎం నరేంద్ర మోదీ గ్రాఫ్‌ పడిపోతుందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ.. బయటకు వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతుందన్నారు. విజయవాడ వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వరప్రసాద్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీక్ష ప్రజాస్వామ్య ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే.. దాని అర్థం మారిపోతుందన్నారు. 

పరిపాలన అంతా జన్మభూమి కమిటీల్లోనే పెట్టారని, కలెక్టర్లకు అధికారాలు లేకుండా చేశారని వరప్రసాద్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారని అన్నారు. హోదాపై ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే వైఎస్సార్‌ సీపీ వల్లేనని, హోదా వచ్చి ఉంటే ఏపీ ఇంత మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏరోజు హోదా గురించి మాట్లాడలేదన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని తెలిపారు. 

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కూడా మోసం చేసిందని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని వరప్రసాద్‌ అన్నారు. సీఎంగా కొనసాగే హక్కు చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రజలను మోసం చేయడంలోనే చంద్రబాబుకు అనుభవం ఉందని,  ప్రతి రంగంలో ఉన్నవారిని మోసం చేసి ఓట్లు వేయించుకుని, తన తప్పు లేదన్నట్లు చంద్రబాబు బీజేపీపై నెపాన్ని నెడుతున్నారన్నారు. మొదట నుంచి హోదా కోసం పోరాటం చేసింది వైఎస్సార్‌ సీపీనే అని,  చివరకు పార్లమెంట్‌లో 13సార్లు అవిశ్వాసం పెట్టామని, హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేశామని ఎంపీ వరప్రసాద్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement