‘ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’

YSRCP MLA Kakani Govardhan Reddy Slams On Chandrababu Over Nellore Politics - Sakshi

సాక్షి, నెల్లూరు: రాజకీయాలలో సీనియర్‌ను అని చెప్పుకునే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నాటి వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి అనుహ్య స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రైతులను అర్థికంగా ఆదుకునేందుకు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే భరోసా కింద సాయం అందించారని అన్నారు. ఎన్నికల్లో చెప్పినదాని కంటే మరో ఏడాదిని పెంచి అదనంగా రూ. 17,500ల సాయం అందిస్తూ.. రైతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నింటినీ నేరవేరుస్తుండటంతో చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ అని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని, రైతుల పేరుతో పనులు చేపట్టి టీడీపీ నేతలు కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.  నెల్లూరు బ్యారేజీలను ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్న టీడీపీ ప్రభుత్వం దానిని పూర్తి చేయకుండా... టీడీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.

కాగా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు చేశారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి​ అన్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు దాడులకు పాల్పడలేదని నిరూపించుకునేందుకు తాము సిద్ధమని, ఏ కమిటీ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. రాజకీయ కారణాల వల్ల దాడులు జరగలేదని టీడీపీ నేతలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నేరస్తులను ప్రోత్సహించారని, నేరస్తుల ఇళ్లలోనే బస చేసి అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top