సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి | Sakshi
Sakshi News home page

సభ కొనసాగకుండా అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

Published Wed, Jul 24 2019 8:57 PM

YSRCP MLA Ambati Rambabu Fires On TDP In Assembly 2019 - Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల పెన్షన్‌పై స్పష్టమైన వివరణ ఇచ్చి, వీడియోలతో సహా నిజాలు వివరించినా ప్రతిపక్షం గందరగోళం చేస్తోందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతా హుందాగా సభను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయినా కావాలనే కీలకమైన బిల్లులపై సభలో చర్చలు కొనసాగకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని విమర్శించారు.  శాసన సభ సమావేశాల అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు సభలో ఉండకుండా వెళ్లిపోయి తనను మాట్లాడనివ్వడం లేదంటే ఎలా?. చంద్రబాబుకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడటానికి మైక్‌ ఇ‍వ్వడం ఎలా సాధ్యమవుతుంది. సభను సక్రమంగా జరగకుండా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు.

కాగా ఎన్నికల సమయంలో 45 ఏళ్లు నిండిన మహిళల​కు తాము ఏం చేస్తామో మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినా కూడా దాన్ని వక్రీకరించేలా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేదానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దీనిపై మొదటి సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడితే, ప్రతిపక్ష నాయకులు సలహాలు ఇవ్వలేక సభ నుంచి వాకౌట్‌ చేశారని ఎద్దేవా చేశారు. సభ నుంచి పారిపోవడానికేనా మీకు అనుభవం ఉందని ‍ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని అంబటి హితవు పలికారు. 

Advertisement
Advertisement