జైలుకెళ్లడానికైనా సిద్ధం

YSRCp LEader Burra madhusudan yadav Fires On Illegal cases - Sakshi

వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం

పార్టీ కనిగిరి ఇన్‌చార్జి బుర్రా  

పోలీసులు అధికారులు న్యాయంగా వ్యవహరించాలి

కనిగిరి: అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడనని.. ప్రజలకోసం జైలుకెళ్లాడానికైనా సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. పీసీపల్లి మండల అధ్యక్షుడు జి. బొర్రారెడ్డి, మరో పదిమందిని అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. గురువారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్ష, అధికారం, డబ్బుతో ప్రతిపక్షపార్టీకి చెందిన పీసీపల్లి సర్పంచ్‌ను లొంగబర్చుకున్నారన్నారు. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. శ్మశాన వాటికకు ఏవిధమైనా నిధులు మంజూరు లేక పోయినా నిర్మాణం చేపట్టి వారే పగల కొట్టుకుని అన్యాయంగా తమ నాయకులపై కేసులు బనాయించాడాన్ని తప్పుబట్టారు. పీసీపల్లి చెరువులోని సుమారు రూ. 50 లక్షల విలువ చేసే కర్రను అక్రమంగా కొట్టుకోవడాన్ని అడ్డుకున్నందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అంతా కలిసి దోచుకుంటున్నారు
ఎమ్మెల్యే సహా అధికారపార్టీ నాయకులు, అధికారులు కలిసి లక్షలు విలువ చేసే కర్రను దోచుకుంటున్నారని బుర్రా ఆరోపించారు. బ్రాంది షాపుల వద్ద నెలవారీ మామూళ్లు, రోడ్లు, నీళ్లు ఇలా ప్రతిపనిలో పర్సంటేజీలు.. కమిషన్లు తీసుకుంటూ.. ఎమ్మెల్యే  నెలకు ఒక సారి కనిగిరికి వచ్చి మూడు సూట్‌ కేసులు నింపుకుని వెళ్తున్నారని విమర్శించారు. పట్టణంలో చిన్న రోడ్లల్లో మూడంతస్తుల భవనాలు కడుతున్నారని.. వాటిని పగుల కొట్టాలని.. పూర్వీకుల కాలం నుంచి పేదవర్గాల వద్ద ఉన్న ఎకరా, రెండెకరాలు ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే.. మంత్రిని కోరడం దుర్మార్గమైన చర్యంటూ మండి పడ్డారు.

కమీషన్ల బాబూరావు
ఎమ్మెల్యే కదిరిబాబురావు ఇప్పటికి తనపై 6 అక్రమకేసులు పెట్టించారని.. అయినా భయపడనని బుర్రా అన్నారు. ప్రజల్లో విశ్వాసం కొల్పోయిన కమీషన్ల బాబూరావు.. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే అనైతిక రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పోలీసు అధికారులు న్యాయబద్ధంగా విచారణ నిర్వహించాలని బుర్రా కోరారు. అక్రమ అరెస్ట్‌లు కొనసాగిస్తే.. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీపల్లి వైస్‌ ఎంపీపీ మహేష్‌నాగ్, సర్పంచ్‌లు శీలం సుదర్శన్, జపన్య, మోహన్‌రెడ్డి, రమేష్, గోపాల్‌రెడ్డి, కృష్ణా, ఓకే రెడ్డి, మూలె కొండారెడ్డి, పరిమి వెంకట్రావ్, వి. సుబ్బారావు, దత్తాత్రేయ, ఎన్‌. వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి వేల్పుల వెంకటేశ్వర్లు, గుండ్లతోటి మధు, రామన శ్రీను, బాలకృష్ణా పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top