ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..

YSRCP Bapatla MP Nandigam Suresh Shares His Political Entry - Sakshi

అతడు చావును చాలా దగ్గరగా చూశాడు. మరికొద్ది నిమిషాల్లో ఇక తన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని కూడా ఫిక్స్‌ అయిపోయాడు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలను తగలబెట్టిన సమయంలో టీడీపీ నేతల ఆదేశాలతో అతడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ మనస్సాక్షికి కట్టుబడ్డాడు. ఎన్‌కౌంటర్‌ చేస్తామని, రైల్వే పట్టాలపై పడుకోబెడతామని... చంపేసి తన భార్యతో ఊడిగం చేయించుకుంటామని హింసించారు. జగన్‌ పేరు చెబితే వదిలేస్తామంటూ బేరసారాలకు దిగారు. అయినా అందుకు ఒప్పుకోకపోవడంతో మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తోటను తగలబెట్టడంలో వైఎస్సార్‌ సీపీ ప్రమేయం ఉందని పోలీసులు చెప్పించే యత్నం చేసినా సురేష్‌ మాత్రం భయపడకుండా నిజం చెప్పారు తప్ప, ఎటువంటి భయాలకూ, ప్రలోభాలకూ లొంగలేదు. 

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ది పొందిన అతడు ఆ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. మహానేత తనయుడికి వ్యతిరేకంగా చెప్పాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పోలీస్‌ అధికారులు బెదిరింపులకు ఏమాత్రం తలొగ‍్గలేదు. నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడ్డాడు. ఆ సామాన్యుడి మొండి ధైర్యమే....కలలో కూడా ఊహించని అవకాశాన్ని తలుపుతట్టింది. అతని నిబద్ధత, నిజాయితీ వైఎస్‌ జగన్‌ను ఆకట్టుకున్నాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా నందిగం సురేష్‌ను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా గెలుపు బాధ్యతను ఆయన స్వీకరించమే కాకుండా చేతలలో చూపించారు. ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వ్యక్తిని ఎంపీని చేసింది. అతడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ...ఆయన ప్రెస్‌మీట్‌లలో వెనకుండి టీవీలో కనిపిస్తే చాలనుకున్నవ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.

టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన శ్రీరామ్‌ మాల్యాద్రి అక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఎంపీగా సురేష్‌ విజయం సాధించడం అందరినీ  నివ్వెరపరిచింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం నందిగం సురేష్‌ను ఎంపీగా గెలుపొందేలా చేసింది. బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి సామాన్య వ్యక్తిని బరిలో నిలిపిన జగన్‌ నిర్ణయాన్ని ఆమోదించిన ఓటర్లు అతనికి జై కొట్టారు. 

గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో విజయం సాధించిన నందిగం సురేష్‌ ...గతంలో రాజధాని భూముల కోసం చేసిన పోరాటం చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంకు చెందిన నందిగం సురేష్‌ పదో తరగతితో చదువు ఆపేసి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగితే...వారిలో నందిగం సురేష్‌ కూడా ఉన్నారు. తమకున్న రెండెకరాల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భూముల కోసం పోరాటం చేశారు. దాంతో కక్ష సాధింపు చర్యగా ఆయనపై కేసులు పెట్టారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ‍్గలేదు

అంతేకాకుండా  రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలంటూ.. అతడిని పోలీసులు గన్‌ను నోట్లో పెట్టి మరీ బెదిరించారు. మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌ కూడా చంపేస్తానని బెదిరింపులకు దిగారు. ఆఖరికి రూ.50 లక్షలు ఇస్తానని బేరమాడారు. చివరకు ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు సింపుల్‌గా సారీ చెప్పి పంపించేశారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంతటి అవకాశం కల్పించడం ఊహించలేదంటూ ఉండవల్లిలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. 

కూలీ ప‌నుల‌కు వెళ్లే త‌మ లాంటి వ‍్యక్తికి ఎంపీగా అవ‌కాశం ఇచ్చారంటూ భావోద్వేగం నియంత్రించుకోలేక క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. నిన్న, మొన్నటి వరకూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని టీవీల్లో, పేపర్లలో చూసే ఆయన ఏకంగా ఆయనను కలిసి ఫోటో దిగటం కలలో కూడా ఊహించనిది. అవకాశం ఇచ్చిన జగనన్న తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, ఎదురైన అనుభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top