బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు

YSR MLA Srikanth Reddy Criticize On Chandrababu Naidu - Sakshi

రాయచోటి: రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్‌ విసిరారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ చేపడుతున్న తప్పుడు ప్రచారాలపై ధ్వజ మెత్తారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంట కాగడంతో పాటు సమైక్యాంధ్రలోను, ఇప్పుడు 7 సార్లు పొత్తును కొనసాగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తోందంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు.

వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను కొనసాగిస్తూనే లౌకిక వాద పార్టీగా కొనసాగుతోందన్నారు.7 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి లౌకిక పార్టీ అని చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు. కేంద్ర మంత్రి చెప్పాడనో, ఇంకెవ్వరో చెప్పారనో నిందను వైఎస్సార్సీపీ పైకి నెట్టడానికి తెలుగుదేశం కుట్రలు పన్నుతోందన్నారు.బీజేపీతో వ్యతిరేకంగా పోరాడతానని పదేపదే చెబుతున్న చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెయ్యి ఇవ్వడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన పక్కనే కూర్చొని గుసగుసలాడిన విషయాలను ప్రజలు కళ్లారా చూశారన్నారు. ఇంకో వైపు తిరుపతి తిరుమల దేవస్థానంలో బీజేపీ నాయకులకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన కేసులకోసం భయపడి రాజీపడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై అవాకులు, చవాకులు పేలుతున్నారంటూ దుయ్యబట్టారు. మరోవైపు రామోజీరావు ద్వారా అమిత్‌షాతో రాజీ ప్రయత్నాలు చేస్తున్న సీఎం రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పిన విషయం ప్రజలు గుర్తించారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top