‘చంద్రబాబు.. ఇప్పటికీ మించి పోలేదు’

YS Vijayamma Visit YSRCP MPs Hunger Strike - Sakshi

హోదాపై పోరాటానికి ముందు రండి

వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ :  ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకునే పరిస్థితులు చేజారిపోలేదని.. ఇందుకోసం పార్టీలకతీతంగా పోరాటానికి ముందుకు రావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఏపీ భవన్‌ వద్ద ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలను.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరపున ఆమె పరామర్శించారు. అనంతరం వేదిక పైనుంచి ఆమె ప్రసంగించారు. 

‘ఎంపీల దీక్షకు మద్ధతు తెలిపిన వారికి కృతజ్ఞతలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఈ అంశంపై ఢిల్లీ పెద్దలను నిలదీయాల్సిన అవసరం ఉంది. హోదా కోసం వైఎస్సార్‌ సీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఎన్నో దీక్షలు, ఉద్యమాలు జరిగాయి. చివరకు కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసం కూడా పెట్టింది. కానీ, చంద్రబాబు మాత్రం హోదా అంశాన్ని అన్ని రకాలుగా హేళన చేశారు. అధికారంలో ఉండి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకురాలేకపోయారు. కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. ఇప్పటిదాకా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా ఏపీ అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు. ప్రతిపక్షాలు లేకుండా చూడాలని చంద్రబాబు యత్నిస్తున్నారు’ అని విజయమ్మ మాట్లాడారు.

వైఎస్సార్‌ బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్న ఆమె.. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. హోదా సాధించుకునే అవకాశం మనకు ఇంకా ఉంది. ఇతర ఎంపీలు కూడా రాజీనామా.. దీక్ష చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పటికీ మించి పోయింది ఏం లేదు. చంద్రబాబుతోసహా అన్ని పార్టీలకు, ప్రజా సంఘాలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే.. హోదా కోసం కలిసి పోరాడుదాం’ అని విజయమ్మ పిలుపునిచ్చారు. ఇక ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలకు పేరుపేరునా అభినందనలు తెలిపిన ఆమె.. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top