రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేఖ

YS Jagan writes letter to President Ramnath Kovind - Sakshi

ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది

ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై చర్యల్లేవు..  నలుగురికి మంత్రివర్గంలో స్థానం 

రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్‌ వ్యవహారం

రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది

ప్రశ్నిద్దామంటే ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు

 అందుకే మేం అసెంబ్లీకి హాజరు కావడం లేదు

మీరు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని, ప్రతిపక్షం నైతిక స్థైర్యం దెబ్బ తీసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకుని దీనిని ఆపాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు మాఫియా పాలనను ఎలా సాగిస్తున్నదీ వివరిస్తూ తాము ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయం తీసుకున్నదీ జగన్‌ రాష్ట్రపతికి ఒక సుదీర్ఘమైన లేఖలో వివరించారు. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక అసెంబ్లీ వెబ్‌సైట్‌లో వారిని ఇంకా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులుగానే చూపడం పట్ల, నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా కొనసాగించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేంతవరకూ శాసనసభకూ, శాసనమండలికీ హాజరు కారాదని ఈ నెల 26వ తేదీన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు. జగన్‌ రాసిన లేఖను పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. లేఖ వివరాలు ఇలా ఉన్నాయి

గౌరవనీయులు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గారికి,
అయ్యా!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ అసెంబ్లీలో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఏకైక, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా బాహాటంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో మా పార్టీ టికెట్లపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని మంత్రి పదవుల ఆశజూపి, భారీగా నగదును ఇస్తామని ప్రలోభపెట్టి మీడియా సాక్షిగా టీడీపీలోకి చేర్చుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నిబంధనలను అనుసరించి అనర్హులుగా చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు, శాసనమండలి ఛైర్మన్‌కూ మేము పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అంతటితో ఆగకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలైన ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియను రాజ్యాంగ విరుద్ధంగా తన మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా స్థానం కల్పించారు. ఈ నెల (అక్టోబర్‌) ఒకటో తేదీన అసెంబ్లీ జారీచేసిన అధికారిక బులిటెన్‌లో ఈ ఫిరాయింపుదార్లందరి పేర్లను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల జాబితాలోనే చూపించడమే కాక, వారికి అసెంబ్లీలో అధికారపక్షం సరసన స్థానాలను కేటాయించడం దిగ్భ్రాంతికర విషయం! అంతే కాదు ఫిరాయింపుదారులైన జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనలను ఇంకా మా పార్టీ ఉప నేతలుగా చూపడం మరింత దిగ్భ్రాంతికరం. 

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలి...
ఇంతటి అప్రజాస్వామిక వైఖరితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకున్న తరువాత, తొలిసారిగా పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. రాజ్యాంగంపైనా, ప్రజాస్వామిక స్ఫూర్తిపైనా ఇంతకన్నా మించిన దాడి మరొకటి ఉండదు. ఈ అప్రజాస్వామిక వైఖరిని, రాజ్యాంగ ఉల్లంఘనను, అన్ని ముఖ్యమైన రాజ్యాంగబద్ధ సంస్థల దృష్టికి తెచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మేం అసెంబ్లీకి హాజరైతే ఈ ప్రజాస్వామ్య పరిహాసానికి ఆమోదముద్ర వేసినట్లే అవుతుంది. ఈ నెల 26వ తేదీన జరిగిన మా పార్టీ శాసనసభాపక్షం ఈ అంశాలన్నింటిపై క్షుణ్ణంగా చర్చించింది. ఫిరాయించిన 21 మంది (ప్రస్తుతం 20 మంది) ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీపై శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, మంత్రులైన నలుగురినీ తప్పించాలనీ డిమాండ్‌ చేసింది. మా డిమాండ్లు నెరవేర్చే వరకూ శాసనసభకూ, శాసనమండలికీ హాజరు కారాదని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 

రాష్టంలో మాఫియా రాజ్యం...
అమలుకు సాధ్యం కావని అలవిగావని తెలిసి కూడా అబద్ధపు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి,  2014 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు రాష్ట్రంలో అన్నింటినీ అడ్డగోలుగా దోచుకుంటూ పాలనను సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా అవతారం ఎత్తి దోచుకుంటూ ఉన్నారు. అందరూ సిగ్గుతో తలదించుకునేలాగా కాల్‌మనీ సెక్స్‌ కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. మొత్తం మీద రాష్ట్రాన్ని ఒక మాఫియా స్థావరంగా మార్చేశారు. వీరి దోపిడీ రూ.వేల కోట్లకు పైబడి ఉంది. అసలు రాష్ట్రంలో పరిపాలన అన్నదే లేదు. భారీ మొత్తంలో డబ్బును రుణాలుగా తీసుకుంటున్న ప్రభుత్వం, లూటీ చేస్తున్న కొందరు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ‘కాగ్‌’ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తన వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నివేదికల ప్రకారం రాష్ట్రం భారీ రెవెన్యూ లోటుతో ఉందనే దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడవుతోంది. విభజన తరువాత ఇప్పటికి మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.09 లక్షల కోట్లు అప్పులు చేసింది. ప్రస్తుత ఏపీపై మొత్తం అప్పుల భారం రూ 2,05,000 కోట్లుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో  ఈ విధంగా అయితే ఈ రాష్ట్రం ఎక్కడకు పోతోంది? 

అన్నింటా అధిక వ్యయం
టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో కొన్ని తాత్కాలిక భవనాలను వాస్తవం కన్నా మూడింతల అధిక వ్యయంతో నిర్మించింది. పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్టును వాస్తవం కన్నా రెండింతలు ఎక్కువ వ్యయంతో నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రధాన వ్యయమంతా కాంట్రాక్టర్లకు చెల్లించడానికే సరిపోయింది. జీవో ఎంఎస్‌ నెంబర్‌ 22, తేదీ 23 ఫిబ్రవరి 2015 ద్వారా గతంలో చేసిన పనులకూ వ్యయాన్ని పెంచుతూ సివిల్‌ కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ఎక్కువ నిధులను చెల్లించింది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులకు సైతం వ్యయం పెంపును ఇష్టానుసారంగా అనుమతిస్తోంది. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం బయట పడలేని విధంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. జీఎస్‌డీపీ లెక్కలను బాహాటంగానే మాయాజాలం చేసి చూపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు. 

సభా నిబంధనలు కాలరాస్తున్నారు
తన ప్రభుత్వ వైఫల్యాలను, పెచ్చరిల్లిన అవినీతిని ప్రశ్నించడాన్ని ముఖ్యమంత్రి సహించలేకపోతున్నారు. అందుకే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం మాట్లాడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చూస్తున్నారు. తొలి రోజు నుంచీ ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గత మూడున్నరేళ్లుగా దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం, మాట్లాడకుండా అడ్డుకోవడం, ప్రతిపక్షంపై అభ్యంతరకర పదజాలాన్ని ప్రయోగించడం చేస్తున్నారు. స్పీకరే సర్వాధికారి అన్నది సాకుగా తీసుకుని సభా నిబంధనలను కాలరాస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179(సి) ప్రకారం స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసును ఇచ్చినపుడు, నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 14 రోజులు మించకముందు చర్చకు తీసుకోరాదని ఉంది. దీన్ని తోసిరాజనే అధికారం స్పీకర్‌కు లేనే లేదు. అయితే ఏపీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినపుడు 14 రోజుల వ్యవధి అనే నిబంధనను పూర్తిగా తోసిపుచ్చారు. నోటీసు ఇచ్చిన రోజునే అవిశ్వాసాన్ని చేపట్టారు. మా పార్టీ జారీ చేసే విప్‌ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకునేందుకే స్పీకర్‌ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం సభా నిబంధనలకు సంబంధించింది కాదు, రాజ్యాంగంతో ముడిపడి ఉంది. 

అయ్యా,
మేం ఇంతకాలం అవమానభారాన్ని మౌనంగా భరించి... తప్పు చేసినవారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటారని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తరువాత బరువెక్కిన హృదయంతో ఈ శాసనసభ సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వంలోకి తీసుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారో తెలియని పరిస్థితులున్నాయంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం కాక మరేముంది. ఇపుడు మేం కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే మేం కూడా భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని సహకరించిన దోషులుగా మిగిలిపోతాం. అందుకే ఇలాంటి వాటికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించాం. దయచేసి ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఈ పరిహాసాన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
గౌరవాభివందనాలతో...
- వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి     

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం తీర్మానం...
ఈ నెల 26వ తేదీన జరిగిన మా పార్టీ శాసనసభాపక్షం అంశాలన్నింటినీ క్షుణ్ణంగా చర్చించింది. అప్రజాస్వామికంగా నడుస్తున్న అసెంబ్లీకి హాజరుకావడం ఎంత వరకు సమంజసం? రాజ్యాంగ బద్ధమేనా! అని చర్చించి ఏకగ్రీవంగా కింది తీర్మానాన్ని ఆమోదించింది. 

‘మీడియా సాక్షిగా ఫిరాయించిన 21 మంది (ప్రస్తుతం 20 మంది) ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. మా పార్టీ నుంచి ఫిరాయించి మంత్రులైన సి.ఆదినారాయణరెడ్డి, ఆర్‌.వి.సుజయ్‌కృష్ణ రంగారావు, ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియను ఇంకా అసెంబ్లీ వెబ్‌సైట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులుగా చూపిస్తూ ఇంకా వారిని మంత్రివర్గంలో కొనసాగించడం పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. వారిని మంత్రులుగా కొనసాగించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. అందువల్ల వారిని తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో మా డిమాండ్లు నెరవేరేవరకూ, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీని నిర్వహించేంత వరకూ అసెంబ్లీకి హాజరు కావడంలో అర్థం లేదు. మేం కనుక అసెంబ్లీకి హాజరైతే ఈ ప్రజాస్వామ్య పరిహాసానికి ఆమోదముద్ర వేసినట్లే అవుతుంది. అందువల్ల మా డిమాండ్లు నెరవేర్చే వరకూ శాసనసభకూ, శాసనమండలికీ హాజరు కారాదని నిర్ణయించాం. మా డిమాండ్లను నెరవేర్చితే అసెంబ్లీకి సంతోషంగా హాజరవుతాం.’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top