రాష్ట్రాల హక్కుల కోసం ఎంపీల సంఖ్య పెరగాలి : జగన్‌

YS Jagan Welcomes KCR Federal Front - Sakshi

ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే.. కేంద్రంపై మరింత ఒత్తిడి..

హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరముంది: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌తో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎక్కువసంఖ్యలో ఎంపీలు గళమెత్తాల్సిన అవసరముందని, ఈ క్రమంలో ఏపీకి చెందిన 25మంది ఎంపీలకు తోడుగా తెలంగాణ ఎంపీలు 17మంది కలిసివస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎక్కువ ఎంపీల మద్దతు అవసరమందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు కలిసివస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. గంటన్నరపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌ సూచనల మేరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశంపై కేటీఆర్‌ వైఎస్‌ జగన్‌తో చర్చించారు. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

కేసీఆర్‌ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నా: వైఎస్‌ జగన్‌
‘కేసీఆర్‌ ఫోన్‌ చేసి చెప్పిన తర్వాత.. కేటీఆర్‌ వచ్చి నాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రాన్ని ఎదుర్కోవాలంటే.. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం గురించి చర్చించారు. ప్రత్యేక హోదా విషయమే పరిశీలిస్తే.. పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరఫున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్‌ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తాం.’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ప్రత్యేక హోదాకు పూర్తి మద్దతు: కేటీఆర్‌
‘దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు రావాలని, ఏడాదిన్నర కాలం నుంచి తమ అధినేత కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌లతో పాటు మరికొంత మందిని కేసీఆర్‌ కలిసారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై మాట్లాడాలని కోరారు. ఇందులో భాగంగానే నేను వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యాను. తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పోరాడే విషయంపై చర్చించాం. ఇవి ప్రాథమిక చర్చలే. త్వరలోనే కేసీఆర్‌ స్వయంగా వైఎస్‌ జగన్‌ను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై కూలంకశంగా చర్చిస్తారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. హోదాకు సంబంధించిన విషయంలో ఏపీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రజాకాంక్షకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌ మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌తో జరిగిన ఈ భేటీలో కేటీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌, సంతోష్‌‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. అంతకుముందు లోటస్‌పాండ్‌కు వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతల బృందానికి  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top