ఎల్లో మీడియా.. ఎందుకంత ప్రేమ : వైఎస్‌ జగన్‌

YS Jagan Speech In Sattenapalli Public Meeting - Sakshi

జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా? మీ ప్రయోజనమా?

జర్నలిజానికి తూట్లు పొడుస్తున్న మీరు మనష్యులేనా? 

సత్తెనపల్లి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఫైర్‌

అంబటి రాంబాబు, లావు కృష్ణదేవరాయలను గెలిపించాలని కోరిన ప్రతిపక్షనేత

వైఎస్‌ జగన్‌ సభతో జనసంద్రంగా మారిన సత్తెనపల్లి

సాక్షి, సత్తెనపల్లి (గుంటూరు) : ‘ఎల్లో మీడియా నడుపుతున్న పత్రికా అధినేతలు.. జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబంటే మీకెందుకంత ప్రేమ? రైతురుణాలను మాఫీ చేస్తానని తొలి సంతకం చేసి.. ఈ ఐదేళ్లలో వారిని దారుణంగా మోసం చేసిన ఈ వ్యక్తంటే ఎందుకంత ప్రేమ? డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ఈ వ్యక్తి మీద ఎందుకంత ప్రేమ? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు రాకుంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఇంటికి రూ. లక్షా 60 వేలు ఎగ్గొట్టాడు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకులను వలస బాట పట్టించాడు. ప్రత్యేక హోదాను భ్రష్టుపట్టించాడు.. ఇలాంటి వ్యక్తి మీద ఎందుకింత ప్రేమ? అక్షరాల 650 హామీలను నేరవేర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేసిన ఈ వ్యక్తిపై ఎందుకింత ప్రేమ? రాజధాని, విశాఖ, దళితుల భూములు, ఇసుక, బొగ్గు ఏది వదలకుండా దోచుకున్న చంద్రబాబంటే ఎందుకింత ప్రేమ?’  అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ప్రతి రోజు ఓ పుకారు పుట్టించి ఈ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని, ఈ ఎల్లోమీడియా మాయలో పడొద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు‌‌, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

ఎక్కడా లేని కోడెల ట్యాక్స్‌..
రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశానని గర్వంగా చెబుతున్నా. ఆ పాదయాత్ర ఇదే సత్తెనపల్లి మీదుగా కూడా సాగింది. ఆ పాదయాత్రలో గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన రైతన్న మాట గుర్తుకుంది. కోడెల అవినీతి గురించి చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఉందని, కానీ సత్తేనపల్లి, నరసరావుపేటలో మాత్రం ఎక్కడా లేని విధంగా కేఎస్టీ కూడా ఉందని, కోడెల సర్వీస్‌ ట్యాక్స్‌ అంటూ మీరు చెప్పిన మాటలు మరిచిపోలేదు. అపార్ట్‌మెంట్‌ కట్టాలన్నా.. వ్యాపారం చేయలన్నా.. మాముళ్లు ఇయ్యాల్సిందేనని మీరు చెప్పిన ఆ మాటలు ఇంకా గుర్తుకున్నాయి. కోడెల విత్తన కంపెనీ నాసిరకం విత్తనాలు తయారు చేస్తుందని.. కానీ ప్రభుత్వం మాత్రం రైతులు కొనేలా ఉత్తర్వులు జారీచేస్తుందని మీరన్న మాటలు మర్చిపోలేదు. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కోడెల.. స్పీకర్‌ పదవి చేపట్టి ఆ పదవిని భ్రష్టు పట్టించారు.

బాబూ.. ఆ నవ్వు అందుకే..
చంద్రబాబు పాలనలో మోసం తప్పా మరేదైనా చూశామా? తాను ఎక్కడికి వెళ్లినా.. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల్లో చిరునవ్వు కనిపిస్తుందని ఈ మధ్య చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. నిజమే చంద్రబాబు.. చిరునవ్వు కనిపించింది వాస్తవమే.. కానీ అది నీ పాలనను చూసి కాదు.. మరో వారంలో నీ ప్రభుత్వం దిగిపోతుందనే ఆనందం అది. ఐదేళ్ల చంద్రబాబు దుష్టపాలనను గుర్తుచేసుకుని బాబును దించబోతున్నామని.. నిరుద్యోగులు.. వ్యాపారులు, కార్మికుల, రైతులు, ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తోంది. కానీ కొందరి ముఖాల్లో మాత్రం భయం కనిపిస్తోంది. రోజుకు నాలుగు దుష్ర్పచారాలు చేసినా కూడా జనాలు నమ్మడం లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ట, చంద్రబాబు ముఖాల్లో భయం కనిపిస్తోంది.

ఛీకొట్టి ఉమ్మేసినా..
చంద్రబాబుకు అధికారం వచ్చేస్తుందని, లోక్‌నీతి-సీఎస్‌డీ సర్వేనని ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్‌గా ప్రచురించింది. అలాంటి సర్వే తాము చేయలేదని అదే లోక్‌నీతి సీఎస్‌డీ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖంపై ఉమ్మేసింది. అయినా తుడుచుకుని సిగ్గులేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఓ గర్భిణిపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడి చేశారంటూ ఓ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అసలు ఈ ఘటనకు వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని అక్కడి పోలీసులు చెప్పినా కూడా సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9, అమ్ముడుపోయిన ఎల్లో మీడియా చానళ్లు.. బంగారం కన్నాబొగ్గే అందంగా ఉంటుందని, నెమలి కంటే కాకియే అందంగా ఉందని, ప్రపంచంలో అందరికంటే అందగాడు.. పరిపాలన యోగ్యుడు చంద్రబాబేనని నమ్మిస్తారు. ఈనాడు రోజు నాలుగు పేపర్లు రాస్తుంది. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్లు వార్తా కథనాలను వడ్డిస్తోంది. ఇటువంటి పేపర్లు, చానళ్లు మళ్లీ నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఇంత కన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా? మీ ప్రయోజనమా? లేక ప్రజల ప్రయోజనమా? జరగని సంఘటనలను.. చంద్రబాబు చేయించిన పనులను కూడా మాపై నెట్టేసి జర్నలిజాన్ని తూట్లు పొడిచే మీరు మనష్యులేనా? నిజాలకు పాతర వేస్తూ.. ఎస్సీల్లో పుట్టాలా? అన్న చంద్రబాబు వ్యాఖ్యలు బాగుంటే.. వనజాక్షిపై దాడి, రాజధాని భూకుంభకోణం, ఓటుకు కోట్లకు అడ్డంగా దొరికినా.. ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టినా ఏ ఒక్కరోజైనా ఈ ప్రతికలు రాసాయా? ఈ చానళ్లు చూపించాయా? చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే ఎక్కడ డిపాజిట్లు రావోనని, ప్రతి రోజు ఓ పుకారు పుట్టించి అసత్యప్రచారానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి చానళ్ల గురించి ఒకసారి ఆలోచించమని కోరుతున్నా.

అన్న ఉన్నాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు.  ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top