
సాక్షి, ఆళ్లగడ్డ: చర్మం కాలిపోయి అనారోగ్యంతో బాధ పడుతున్న నిరీక్షణ అనే బాలిక పరిస్థితిని చూసి జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చలించిపోయారు. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభకు తనతో పాటు ఆమెను తీసుకొచ్చారు. నిరీక్షణ దయనీయ స్థితి గురించి ప్రజలకు వివరించారు.
‘చర్మం కాలిపోయి పనులు చేసుకోలేకపోతోంది. నాకే బాధే అనిపించి తీసుకొచ్చా. ఆమెకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం లేదు. నీకు మైకు ఇస్తాను. నీ గురించి చెప్పు. అప్పుడైనా చంద్రబాబు బుద్ధి వస్తుందేమో. నేను కూడా నీ గురించి కలెక్టర్‌కు లేఖ రాస్తాను’ అంటూ ఆమె చేతికి మైకు అందించారు. ‘నా పేరు నిరీక్షణ. చర్మం కాలిపోయి రెండేళ్లుగా బాధ పడుతున్నాను. నాకు పెన్షన్ రావడం లేదు. జగనన్న నన్ను ఆదుకుంటార’ని నిరీక్షణ పేర్కొంది.
దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కోసం జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లక్కర్లేదు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తా. ప్రతి సామాజిక వర్గం నుంచి 10 మందికి ఇందులో ఉద్యోగాలిస్తాం. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో అన్ని వచ్చేట్టు చేస్తాను. రాజకీయాలు, మతాలు, కులాలు, పార్టీలు చూడకుండా అందరికీ అన్ని ఇస్తామని మాట ఇస్తున్నాన’ని వైఎస్ జగన్ ప్రకటించారు.