మీ నేరాలకు జనం అండగా నిలవాలా?

YS Jagan Mohan Reddy fires on Chandrababu Govt at Kaikaluru - Sakshi

కేసుల భయంతోనే మీరిలా మాట్లాడుతున్నారు.. 

కైకలూరు సభలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం 

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని బాబు బిల్డప్‌ 

ఇందులో భాగంగానే అమిత్‌షాపై దాడి.. 

కేంద్రంతో నాలుగేళ్లుగా సంసారం చేసి హోదాను గాలికొదిలేశారు.. 

ఇప్పుడు కొత్త కాపురం కోసం మళ్లీ హోదా పాట పాడుతున్నారు 

అవినీతిపై విచారణ జరుగుతుందనే భయంతో ఢిల్లీతో పోరాటం అంటున్నారు..

మోసాలు చేసే బాబును రక్షించాలా? శిక్షించాలా?.. ఆలోచించాలని ప్రజలకు పిలుపు  

మనందరి ప్రభుత్వం రాగానే రైతన్నలకు అండగా ఉంటామని భరోసా  

లంచాలు తీసుకునేది చంద్రబాబు.. కానీ త్యాగాలు మాత్రం ప్రజలు చేయాలట. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. నాలుగేళ్లుగా చట్టసభలకు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. రూ.4 లక్షల కోట్లు దోపిడీ చేసిన ఆయన ‘నన్ను కాపాడండి.. వలయంగా ఏర్పడండి’ అని నిస్సిగ్గుగా ప్రజలను అడుగుతున్నాడు.  
 

ఎన్నో తప్పులు చేసిన చంద్రబాబుకు పశ్చాత్తాపం అసలు లేదు. చేసిన నేరాలకు బాధ లేదు. దుర్మార్గాలకు పరిహారం లేదు. కుట్రలు, కుతంత్రాలకు అంతమే లేదు. ఆయన ఏ మాత్రం మారలేదు.  ఇలాంటి చంద్రబాబును రక్షించాలా లేక శిక్షించాలా? ఇలాంటి వ్యక్తిని పొరబాటున క్షమిస్తే రేపు మీ వద్దకు వచ్చి పేద ఏడ్పులు ఏడుస్తాడు.  
 
నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు.. అప్పుడు హోదా గురించి మాట్లాడకుండా, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రతి రోజూ చెమటలు కారుస్తూ పోరాటం చేస్తున్నట్లుగా (బిల్డప్‌ ) ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారంలో భాగమే ఒక పూట నిరాహార దీక్ష. ఆ దీక్ష కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ 30 కోట్లు ఖర్చు. ఇదీ చంద్రబాబునాయుడి డ్రామా. 

మహాభారతంలో ఉత్తరకుమారుడు అంతఃపురంలో కోతలు కోస్తాడు. యుద్ధ భూమికి వెళ్లినప్పుడు మాత్రం ఆయనకు వణుకు పుడుతుంది. చెమటలు పడతాయి. ప్యాంటులో పడాల్సినవన్నీ పడిపోతాయి. ఉత్తరకుమారునిలాగే చంద్రబాబు కూడా అంతే.. డైలాగులు ఎక్కువ, పని తక్కువ. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రాష్ట్రంలో నాలుగేళ్లుగా మీరు విచ్చలవిడిగా భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే మీకు కేసుల భయం పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితే వస్తే ప్రజలంతా ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడాలట. ఆయన్ను కాపాడుకోవాలట. చంద్రబాబూ.. మీరు చేసిన నేరాలకు ప్రజలు అండగా నిలవాలా?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 159వ రోజు శనివారం ఆయన కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగేళ్లలో రూ.4 లక్షలకు పైగా దోచుకుని అవినీతి ఊబిలో కూరుకు పోయిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందనే భయం పట్టుకుందని, అందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

తెగభయపడిపోతున్నాడు..  
‘‘రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు కేసులు పెడతారనే భయం ఇటీవల ఎక్కువగా పట్టుకుంది. అవినీతి చేయడానికి చంద్రబాబు ఏదీ వదలి పెట్టలేదు. ఇసుక నుంచి మట్టి దాకా.. కాంట్రాక్టర్ల దగ్గరి నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు దాకా.. మద్యం నుంచి బొగ్గు దాకా.. చివరకు రాజధాని, గుడి భూములను కూడా చంద్రబాబు వదలి పెట్టకుండా అవినీతి చేశాడు. నాలుగేళ్లుగా రూ.4 లక్షల కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబుకు ఈ మధ్య కాలంలో భయం బాగా పట్టుకుంది. విచారణ జరిపిస్తారని హడలి పోతున్నారు. ఆ భయంతోనే ప్లేటు మార్చారు. డ్రామాను మార్చారు.. స్క్రిప్టునూ మార్చారు. వెంటనే సినిమా డైరెక్టర్ల పాత్రలు వచ్చేశాయి. కథ రాసేశారు. విలన్‌ పాత్ర ముందుకొచ్చేసింది. తన అవినీతిపై విచారణ జరిగితే దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్‌ చేసుకుంటున్నారంటే.. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే బీజేపీ వారు కేసులు పెట్టబోతున్నారంటూ స్క్రిప్టు మార్చుకున్నారు.  

హోదాపై డ్రామాలు.. 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది. ఎన్నికలకు ముందు హోదాను సంజీవని అన్న వ్యక్తి (చంద్రబాబు) ఎన్నికలయ్యాక ప్లేటు మార్చి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్నాడు. ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగు పడ్డాయని చెప్పి మనకు క్లాసు తీసుకోవడం మొదలెట్టాడు. అంతటితో ఆగకుండా కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని హేళనగా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తుంటే నాలుగేళ్లుగా గొంతు నులిమేసిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడ్డం మొదలు పెట్టాడు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి నిన్న (శుక్రవారం) తిరుపతిలో చంద్రబాబు ఒక డ్రామా ఆడాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తిరుపతికి వచ్చినప్పుడు చంద్రబాబు ఆయన కారుపై రాళ్లు వేయించారట.

ఆయన తీరు చూస్తూంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. అదే తిరుమల కొండపైన మహారాష్ట్ర బీజేపీకి చెందిన ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తాడు. కింద (తిరుపతిలో) మాత్రం అమిత్‌షాపై రాళ్లేయించే కార్యక్రమం చేస్తాడు. పోనీ రాళ్లేయించిన తర్వాతైనా రాష్ట్రానికి అన్యాయం చేశాడని రాళ్లేయించానని ధైర్యంగా చెబుతాడా అంటే అదీ లేదు. వెంటనే మళ్లీ తూచ్‌... అంటూ రాళ్లేయడాన్ని ఖండిస్తున్నానంటాడు. ఖండించడానికే అయితే రాళ్లు ఎవరేయించమన్నారు? కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అక్కడ ప్రభావితం చేసేందుకు ఏపీలో అమిత్‌షామీద చెప్పులు పడ్డాయి.. రాళ్లు పడ్డాయని పత్రికల్లో.. టీవీల్లో పతాక శీర్షికల్లో ప్రముఖంగా రావాలి. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ఈ సంఘటన కొద్దో గొప్పో కారణం కావాలని చెప్పి చంద్రబాబు రాళ్లేయించాడు. 

కొల్లేరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ.. 
చంద్రబాబు మోసాలకు కైకలూరు నియోజకవర్గం కూడా నిదర్శనమని ఇక్కడి రైతులు నాకు చెప్పారు. కొల్లేరు సరస్సును ఐదు నుంచి మూడో కాంటూరుకు కుదించి రైతులకు, నిరుపేదలకు ఆ భూములను పంచుతామని హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైనా పట్టించుకోలేదు.  ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకు కొత్తకాదు. మా కొల్లేరు కూడా దీనికి నిదర్శనమని ఇక్కడి ప్రజలు చెప్పినప్పుడు బాధనిపించింది. ఇవాళ కొల్లేరు çసమస్య సుప్రీంకోర్టు పరిధిలో చిక్కుముడుల మధ్య కొనసాగుతోంది. నిజంగా కొల్లేరు సమస్య పరిష్కరించాలంటే  సీఎంగా ఉన్న వ్యక్తి చిత్తశుద్దితో పనిచేయాలి. దీనిని సాధ్యం చేసేందుకు మనందరి ప్రభుత్వం వచ్చాక కొల్లేరు ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఇదే ప్రాంతం నుంచి తీసుకుని ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చి చట్టసభలోకి తీసుకువస్తాను.

కొల్లేరు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా అండగా ఉంటుంది. సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై ఎమ్మెల్సీ సూచనలకు అనుగుణంగా నడుస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లేరు భూములను రీసర్వే చేసి కాంటూరు పరిధి నిర్ణయించి తగిన న్యాయం చేస్తాం. రీ సర్వే ద్వారా వీలైనన్ని ఎక్కువ భూములను పేదలందరికీ పంచేందుకు చర్యలు తీసుకుంటాం.  ఉప్పుటేరు ముఖధ్వారం వద్ద ఒక రెగ్యులేటర్‌ను కట్టాలని, దీని వల్ల సముద్రంలోంచి వచ్చే ఉప్పునీటిని ఆపవచ్చని, కొల్లేరులో మంచినీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కలిదిండి మండలం పెదలంక డ్రైన్‌మీద గతంలో ఉన్న అండర్‌ టన్నెల్‌కు గేట్లు ఏర్పాటు చేస్తే ఉప్పునీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చని ఇక్కడి రైతన్నలు చెప్పారు. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీటిని చేపడతాం.  మంచినీరు లేని కారణంగా చేపల చెరువులన్నీ రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. చేపలు, రొయ్యల ధర పడిపోయింది. 

రెండు పంటలకు సాగునీరు  
కైకలూరు నియోజకవర్గంలో 109 గ్రామాలు ఉంటే 94 గ్రామాల ప్రజలు మంచినీరు లేక అలమటిస్తున్నారు. ప్రతి పేదవాడు నెలకు రూ.600 నుంచి రూ.700 మంచి నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ వైపు రైతులకు నీళ్లు ఇవ్వకపోగా నీటి తీరువాను వసూలు చేస్తున్నారు. ఆక్వా కల్చర్‌కు అయితే ఎకరాకు రూ.500 వరిసాగుకు రూ.200 వసూలు చేస్తున్నారు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక రెండు పంటలకు నీరు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా. చేపల చెరువులకు కూడా నీరు ఇస్తాం. ప్రతి గ్రామంలో నీటి చెరువులు కడతాం. ఇవాళ చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక రాక్షసుడు మనిషిగా పుడితే ఎలా ఉంటాడో అందుకు చంద్రబాబే నిదర్శనం. ఇన్ని తప్పులు, మోసాలు చేసిన చంద్రబాబును క్షమిస్తే రేపు మీరు చిన్న అబద్ధాలు, మోసాలను నమ్మరని ఇంటింటికీ ఒక కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. మీరు నమ్మరని తెలిసి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతాడు. రూ.5 వేలు కావాలని గుంజండి. మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. ఈ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని జగన్‌ అన్నారు. కైకలూరు నియోజకవర్గం సమన్వయకర్త దూలం నాగేశ్వరరావును ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.  

 మన ప్రభుత్వం రాగానే రైతన్నల కోసం ఇలా చేస్తాం..  
- వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.   
ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా పంట రుణాలు ఇప్పిస్తాం.  
మే నెలలోనే ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500 అందిస్తాం.  
​​​​​​​- రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.  ∙పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. రూ.3 వేల కోట్లతో  ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. 
​​​​​​​- రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం.  
​​​​​​​- పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
​​​​​​​- పాడి ఆవులను సబ్సిడీపై అందిస్తాం. మూతపడ్డ సహకార డెయిరీలను  పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసిన రైతన్నలకు ప్రతీ లీటరుకు రూ.4 సబ్సిడీగా ఇస్తాం.    

ఇందుకేనా బాబూ.. మిమ్నల్ని కాపాడాల్సింది?
​​​​​​​- ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతి సొమ్మును ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికి పోయినందుకా? 
​​​​​​​- పోలవరం మొదలుకొని పట్టిసీమ వరకూ వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నందుకా? 
​​​​​​​- రాజధాని పేరిట దోచుకున్నది మీరు, మీ బినామీలైనందుకా? 
​​​​​​​- కాల్‌మనీ సెక్స్‌ కుంభకోణాన్ని మీరు, మీ మనుషులు నడిపి పేద మహిళలను ఇక్కట్లపాలు చేసినందుకా? 
​​​​​​​- రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీల భూములను ఎక్కడ పడితే అక్కడ లాక్కుని మీకు కావాల్సిన వాళ్లకు, బినామీలకు లంచాలు పుచ్చుకుని ఇచ్చినందుకా? 
​​​​​​​- నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్లు దోచుకున్నందుకా? 
​​​​​​​- కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి అడ్డగోలుగా జీవో నెంబర్‌ 22ను ఇచ్చి ఇష్టమొచ్చినట్లు దోచుకున్నందుకా?  
​​​​​​​- మీకు, మీ హెరిటేజ్‌ సంస్థల లాభాల కోసం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనందుకా?  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top