
సాక్షి, వేంపల్లి (వైఎస్‌ఆర్ జిల్లా): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లిలో కొనసాగుతోంది. ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు, జనంతో మమేకమయ్యేందుకు నడచి వస్తున్న రాజన్న తనయుడు జగనన్నకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రలో భాగం అవుతున్నారు. వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు.
వేంపల్లి క్రాస్‌రోడ్ వద్ద జెండా ఆవిష్కరణ
వేంపల్లి శివారు నుంచి పాదయాత్రగా వేంపల్లి క్రాస్‌రోడ్డుకు వచ్చిన వైఎస్ జగన్‌కు అశేషమైన జనవాహిని ఘనస్వాగతం పలికింది. వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో వేంపల్లి క్రాస్‌రోడ్డు జనసంద్రంగా మారింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ.. ప్రజలందరికీ అభివాదాలు చేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్ వేంపల్లి క్రాస్‌రోడ్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ముగ్గులు.. హారతులతో..!
పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌కు వేంపల్లిలో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. రోడ్లపై ముగ్గులేసి.. హారతులతో మహిళలు స్వాగతం పలికారు. వైఎస్ జగన్ పాదయాత్రలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఓ మహిళ వికలాంగుడైన కుమారుడ్ని జగన్ వద్దకు తీసుకొచ్చి ఆశీర్వదించాలని కోరారు. గతంలో తనకు పెన్షన్ వచ్చేదని, కానీ ఇప్పుడు తొలగించారని మరో వృద్ధురాలు జననేత వద్ద బోరున విలపించారు. వైఎస్‌ఆర్ హయాంలో రుణాలు, పెన్షన్లు ఇచ్చారని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తమ ఫించన్లను తొలగించారని పలువురు మహిళలు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు తెలుసుకొని.. వారికి అండగా తానుంటానని భరోసా ఇస్తూ.. తాను అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.
చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు!
జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి తమను మోసం చేశారని యువత, విద్యార్థులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఇస్తానన్న భృతిని గాలికొదిలేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే.. తమకు మేలు జరుగుతుందని వైఎస్ జగన్ పాదయాత్ర దారి పొడవునా యువత గొంతెత్తుతున్నారు.
రైతులు, మైనారిటీలతో వైఎస్ జగన్ భేటీ
పాదయాత్రలో భాగంగా వేంపల్లిలో రైతులు, మైనారిటీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించారు. రైతు రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని, ఎవరికీ సమగ్రంగా రుణమాఫీ కాలేదని రైతులు తెలిపారు. పంటలకు మద్దతు ధర లభించడం లేదని, గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)