నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే

YS Jagan Fires On Chandrababu At Kothavalasa - Sakshi

కొత్తవలస సభలో ప్రజలనుద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

3,000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన ప్రజా సంకల్ప యాత్ర

నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో రాష్ట్రానికి 29వ స్థానం

రాష్ట్రంలో రైతు కష్టాలపై అమెరికాలోని తెలుగు వారికి చెప్పే దమ్ముందా చంద్రబాబూ?

71 లక్షల హెక్టార్ల నుంచి 59 లక్షల హెక్టార్లకు సాగు పడిపోయిందని చెప్పండి 

రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టాననీ చెప్పండి 

రుణమాఫీ చేయకుండా మోసం చేసింది కాక సేంద్రియ వ్యవసాయంపై ప్రసంగాలట

బాబు నాలుగున్నరేళ్ల పాలనపై జననేత ధ్వజం

చంద్రబాబు ఇదే ఎస్‌.కోట నియోజకవర్గానికి వచ్చినపుడు తన వేలికి ఉంగరం, చేతికి గడియారం,మెడలో గొలుసు కూడా లేదన్నాడు. తనంత నీతి పరుడు ప్రపంచంలోనే లేడన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చాడు. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయల డబ్బు ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికి పోయాడు. 

ఏపీలో 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడానికి మాత్రం ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి. రెండెకరాల  భూమితో రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఈ పెద్దమనిషి ఇవాళ నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి పరుడయ్యాడు. హెరిటేజ్‌ షాపులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. 

కిడారి సర్వేశ్వర్‌రావు మృతి పట్ల సంతాపం  
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దుర్ఘటనలో మృతి చెందడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఎమ్మెల్యే మన పార్టీని విడిచిపెట్టి వెళ్లి మనల్ని మోసం చేసినప్పటికీ ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియ జేస్తూ ఇవాళ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను.

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘నా ఈ పాదయాత్రలో 3,000 కిలోమీటర్ల దూరాన్ని ఇవాళ ఇక్కడకు వచ్చే ముందే దాటాను. అక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాను. నిజంగా ఓ సారి చూస్తే.. ఎక్కడ ఇడుపులపాయ? ఎక్కడ విజయనగరం జిల్లాలోని కొత్త వలస..? అని అనుకుంటున్నాను. నిజంగా మూడు వేల కిలోమీటర్లు నడవగలుగుతామా? అని యాత్ర ప్రారంభంలో నన్నెవరైనా అడిగినప్పుడు నా ముఖంలో వారికి చిరునవ్వు కనిపించేది. పైన దేవుడున్నాడు.. కింద ప్రజలున్నారు.. వాళ్లే నడిపిస్తారనే భావంతో ఆ  చిరునవ్వు ఉండేది. ఇవాళ 3,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత నిజంగానే పైన దేవుడున్నాడు. కింద అభిమానించే ప్రజలున్నారని మాత్రం గర్వంగా చెబుతున్నాను. మీరందరూ చూపిన ఆప్యాయతల వల్లే ఈ యాత్రలో నడవగలిగాను అని కూడా గర్వంగా చెబుతున్నాను. నడిచేది నేనైనా.. నడిపించింది మాత్రం మీ అభిమానమే’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 269వ రోజు సోమవారం ఆయన విశాఖపట్టణం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో 3,000 కిలోమీటర్ల మైలు రాయిని కూడా అధిగమించారు. ఈ సందర్భంగా ఎస్‌.కోట శాసనసభా నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే జంక్షన్‌ సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రైతులు పడుతున్న కష్టాల గురించి అమెరికాలో చెప్పగలరా? అని నిలదీశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

దెయ్యాలు వేదాలు వల్లించినట్లే.. 
‘‘చంద్రబాబు పుణ్యాన రైతులంతా అవస్థలు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కానీ ఆయన మాత్రం అమెరికా బయల్దేరారు. అక్కడ ఓ అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం మేరకు ఈ పెద్దమనిషి అమెరికాకు వెళ్లాడట. అక్కడ ఆయన రైతుల గురించి ఉపన్యాసం ఇస్తారట. ఆర్గానిక్‌ వ్యవసాయంపై ప్రసంగిస్తారట. ఇక్కడ మాత్రం గుంటూరు నుంచి అనంతపురం వరకు ఏ జిల్లాలో చూసినా కరువు తీవ్రంగా ఉంది. మిగతా జిల్లాల్లోనూ సకాలంలో వర్షాలు పడక పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు చీమ కుట్టినట్టయినా ఉండదు. కరువు మండలాలు ప్రకటించడంలో జాప్యం. తీరా ప్రకటించినా రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వరు. లోన్లు రీషెడ్యూల్‌ కావు. ఇన్సూరెన్స్‌ పరిస్థితి దేవుడెరుగు.  అమెరికాలో ఇచ్చే ప్రసంగంలో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి గురించి చంద్రబాబు నిజాయితీగా మాట్లాడాలి. ఇటీవల నాబార్డు నివేదిక ప్రకారం దేశంలోని 29 రాష్ట్రాల్లోని రైతుల ఆదాయం లెక్కిస్తే మన రాష్ట్రం చిట్టచివర స్థానంలో ఉంది. రైతులకున్న అప్పుల విషయమే చూస్తే రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ విషయం అమెరికాలోని ఉపన్యాసంలో చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి హయాంలో 71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు భూమి ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు సాగులోనున్న భూమి 59 లక్షల హెక్టార్లకు పడిపోయిందనే విషయాన్నీ అమెరికాలో చెప్పగలరా? రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన వైనం చెప్పగలరా? రైతులకు గతంలో ఇస్తున్నట్లుగా సున్నా వడ్డీ సొమ్మును ఇవ్వకుండా అన్యాయం చేశానని చెప్పగల దమ్ము చంద్రబాబుకు ఉందా? ఇలాంటి నేపథ్యంలో ఆయన అమెరికాలో స్పీచ్‌ ఇస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా?

  

బాబు పాలన చూస్తుంటే బల్లాట గుర్తుకొస్తోంది.. 
మరో ఆర్నెల్లలో ఎన్నికలు జరగబోతున్నాయనే వాతావరణం మనకందరికీ కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఎలాంటి వ్యక్తి మనకు నాయకుడిగా కావాలో అందరూ గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా. అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే వారు మీకు నాయకుడిగా కావాలా? ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే చిన్నపిల్లలు బల్లకు ఇరువైపులా కూర్చొని ఆడుకొనే బల్ల ఆట గుర్తుకొస్తోంది. ఒకవైపు బరువున్న పిల్లాడు కూర్చుంటే అవతలి వైపు బరువులేని పిల్లాడు పైకి లేస్తాడు. మళ్లీ బరువున్న పిల్లాడు కాస్త పైకి లేస్తే బరువులేని పిల్లాడు కాస్త కిందికి దిగుతాడు. ఈ ఆట మనమంతా చూసేఉంటాం. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఈ ఆట మాదిరిగానే ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే సబ్సిడీలు ఎగిరిపోతాయి. సంక్షేమ పథకాలు ఎగిరిపోతాయి. నీతి ఎగిరిపోతుంది. నిజాయితీ ఎగిరిపోతుంది. విలువలూ ఎగిరిపోతాయి. చంద్రబాబు దిగిపోతే మళ్లీ అవన్నీ తిరిగివచ్చే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఒకసారి చూస్తే సొంతకూతురిని ఇచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అలా పొడిచి 1995 నుంచి 2003 వరకు అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలోకి వస్తూనే బల్ల ఆట మొదలైంది. అప్పటిదాకా ఉన్న మద్యనిషేధం గోవిందా.. రెండు రూపాయలకు కిలో బియ్యం గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. గిట్టుబాటు ధరలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. రాజకీయాల్లో విలువలు గోవిందా.. అన్నీ గోవిందా! గోవిందా! గోవిందా!  

వైఎస్‌ హయాంలో వ్యవసాయం పండుగ 
రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? రైతులకు ఉచితంగా కరెంట్‌ వచ్చింది. కరెంట్‌ బకాయిలను పూర్తిగా మాఫీచేస్తూ మొదటి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చింది. కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ 108 వచ్చింది. 104 వచ్చింది. దేశం మొత్తంమీద 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే దేశంతో పోటీపడి మరో 48 లక్షల ఇళ్లు కట్టించారు. రైతన్నలకు మేలుచేసేలా పెండింగ్‌లోనున్న ప్రతి ప్రాజెక్టునూ జలయజ్ఞంతో పూర్తి చేయించేదిశగా అడుగులు వేశారు. ఆయన పుణ్యాన లక్ష ఎకరాల్లో పంటలు పండాయి. రైతులకు పండుగ అయ్యింది. గిట్టుబాటు ధరలు వచ్చాయి. కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచని పాలన దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి హయాంలో చూశాం. ఆయన అధికారంలోకి రావడంతో మళ్లీ రెండ్రూపాయలకే కిలో బియ్యం వచ్చాయి. పింఛన్లు వచ్చాయి. పేదలందరికీ భూ పంపిణీ జరిగింది. మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం సీటులో కూర్చున్న తర్వాత పరిస్థితి గమనించాలని కోరుతున్నాను. మళ్లీ బరువు ఎక్కువైంది. రైతుల సంక్షేమం, రుణాల మాఫీ అంటూ మోసం చేశారు. బ్యాంకుల్లో నుంచి బంగారం విడిపిస్తానని చెప్పిన ఈ పెద్దమనిషి ఆ బంగారం వేలానికి వేస్తున్న పరిస్థితి తెచ్చారు. ఆయన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ వ్యవసాయం దారుణంగా మారింది. అప్పులు పెరిగిపోయాయి. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. గతంలో రైతన్నలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ వడ్డీ నేరుగా బ్యాంకులకు కట్టే పరిస్థితి ఉండేది. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల రుణాలపై ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వడ్డీని కూడా బ్యాంకులకు పూర్తిగా కట్టడం మానేశారు.  

ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.. 
అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయకపోగా చంద్రబాబు చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం ఆపేశారు. ఈ పెద్దమనిషి పిల్లల చదువుల గురించి మాట్లాడ్డం చూస్తే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని దగ్గరుండి నీరు గారుస్తాడు. ఈ పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదు. ఈ పెద్ద మనిషి మళ్లీ స్కూళ్ల గురించి మాట్లాడతాడు. రేషనలైజేషన్‌ అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను మూసేయిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 20 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయడు. తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లకు పిల్లలను పోయేలా చేస్తున్నారు. ఇవాళ మన పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపాలంటే సంవత్సరానికి కనీసం రూ.40 వేలు అవుతోంది. అదే నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపితే చంద్రబాబు పుణ్యమా అని అక్షరాలా లక్షల్లో ఫీజులు  గుంజుతున్నారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేశారు 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేస్తారు. ఇంజినీరింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. కానీ కళాశాలల్లో ఏడాదికి రూ. లక్ష గుంజుతున్నారు. అంటే రూ.70 వేలు ప్రతి పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి తెచ్చి కట్టుకోవాలి. ఇలా నాలుగేళ్లలో రూ.3 లక్షలు ఒక విద్యార్థి కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. లేదంటే రూ.2 వేలు భృతి ఇస్తానన్నాడు. ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలను పీకేస్తాడు. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడు. ఉద్యోగాలు రావు. రాష్ట్ర విభజన చేసేటపుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా?  డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడు కానీ, టెట్‌ ఒన్, టెట్‌ టూ, టెట్‌ త్రీ అంటాడు.  

హోదాను తాకట్టు పెట్టారు 
చంద్రబాబు పరిశ్రమలంటాడు. కానీ వేల పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉండే ప్రత్యేక హోదాను దగ్గరుండి తాకట్టు పెట్టారు. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిందేమిటంటే పరిశ్రమలకు ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీలు రూ.3,200 కోట్ల బకాయిలు ఈవాళ్టికి కూడా అలాగే పెట్టారు.  అలాంటి వ్యక్తి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అవార్డు ఇచ్చారని చెప్పుకుంటుంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలకు కరెంట్‌ రేటు యూనిట్‌కు రూ.8.50 చొప్పున పెంచారు. దివంగత వైఎస్‌ హయాంలో పరిశ్రమలకు రూ.3.10కే యూనిట్‌ విద్యుత్‌ను సరఫరా చేశారు.  ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు.  హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ కట్‌. అదే చంద్రబాబు నాయుడు గారి మంత్రికి పంటి నొప్పి వస్తే ఆ మంత్రి సింగపూర్‌కు పోతాడు. ఇవాళ చంద్రబాబు.. మట్టి, ఇసుక, బొగ్గు కొనుగోళ్లు, కరెంటు కొనుగోళ్లు.. దేన్నీ వదలి పెట్టడం లేదు. కాంట్రాక్టర్లనూ వదలడు. చివరకు దేవుడి భూములను కూడా వదలిపెట్టడు. విశాఖపట్ణణం భూములు, పేదవాడి భూములు, గుడి భూములను కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి. అందుకే అబద్ధాలు చెప్పే వ్యక్తులకు, మోసం చేసే వ్యక్తులకు ఓట్లేయొద్దని చెబుతున్నా. ఇవాళ చంద్రబాబును క్షమిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 99 శాతం చేసేశానని మీ అందరి చెవుల్లో పూలు పెడతాడు. మీరు నమ్మరని.. ఈ సారి తనకు ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అయినా మీరు నమ్మరని ప్రతి ఇంటికీ ఒక మనిషిని పంపి ప్రతి చేతిలో రూ.3000 పెట్టిస్తాడు. ఆ డబ్బును వద్దనకండి. రూ.5000 కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన డబ్బే అది. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. మీ అందరి దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం. నవరత్నాల్లో భాగంగా అవ్వా తాతలు పింఛన్‌ పొందే అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాను. పింఛన్‌ను రూ.2000కు పెంచుతానని హామీ ఇస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

30 ఏళ్లుగా టీడీపీని గెలిపిస్తే మూడు పనులైనా చేశారా? 
విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట నియోజకవర్గ ప్రజలు టీడీపీ పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ల పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపిస్తే కనీసం వారు మూడు పనులైనా చేయలేదు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతిమయంగా మార్చారు. ఇంతకుముందున్న ఎస్‌.కోట, ఉత్తరాపల్లి నియోజకవర్గాలు ఏకమై ఎస్‌.కోట నియోజకవర్గమైంది. 2004లో తప్ప గత 30 ఏళ్లుగా ఆ పార్టీ వారినే ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఏం లాభం లేదన్నా.. అని ప్రజలు పాదయాత్రలో నాతో చెప్పారు. ఇదే నియోజకవర్గంలోని కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ మండలాలు నిరంతర కరువు ప్రాంతాలు. వేపాడ మండలానికి ఆనుకొనే రైవాడ రిజర్వాయర్‌ ఉన్నా విశాఖ అవసరాల కోసం నీళ్లు పోతున్నాయి. ఇక్కడి రైతులకు మాత్రం నిరాశే మిగిలిస్తున్న పరిస్థితి. తాటిపూడి రిజర్వాయర్‌ కూడా ఇక్కడే ఉంది. దాని పరిస్థితీ అంతే. ఇక్కడి రైతాంగానికి మేలు జరగాలంటే రైవాడ సామర్థ్యం పెరగాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు.  

బాబు అవినీతి వల్లే పోలవరం నత్తనడక.. 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. కానీ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో పునాదులు దాటి కదలని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందీ.. గోదావరి నీళ్లు విశాఖకు ఎప్పుడు చేరతాయి.. అలా రైవాడ, తాటిపూడి నిండితే ఆ నీటిని ఎప్పుడు వాడుకునే పరిస్థితి వస్తుందీ.. అని రైతన్నలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ప్రతిసారి ఒక డ్రామా ఆడుతున్నారు. అక్కడికి వెళ్లి షో చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఫ్యామిలీని పిక్నిక్‌కు తీసుకెళ్లారు. కానీ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో కళ్ల ముందు కనిపిస్తోంది. డిజైన్లు కూడా ఫైనలైజ్‌ కాలేదు.  

చంద్రబాబు అడుగుపెడితే అంతే... 
భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ విజయనగరం జిల్లా ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టు. గత చంద్రబాబు పాలన ఫలితంగా 2003 నాటికి రూ.18 కోట్ల అప్పులతో దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ పరిస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. దీన్ని గుర్తుపెట్టుకొని 2004లో ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఫ్యాక్టరీని తెరిపించారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మళ్లీ రూ.43 కోట్ల అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి వచ్చిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఎస్‌.కోట నియోజకవర్గంలో రైల్వేలైన్‌ ఉంది. రెండు పోర్టులు సమీపంలోనే ఉన్నాయి. కానీ పారిశ్రామిక అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడట్లేదు. నాన్న గారి హయాంలో శారదా స్టీల్స్, గోల్డ్‌స్టార్‌ స్టీల్స్, మహామాయ కంపెనీ విస్తరణ ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. బాబు పాలనలో ఉన్న జ్యూట్‌ మిల్లులూ మూత పడే పరిస్థితి. 

ఆ హామీలేమయ్యాయి?
ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఇక్కడికొచ్చి కొత్తవలసలో 30 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీలిస్తూనే ఉన్నారు. కానీ అవేవీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు సొంత కళాశాల ఉండటం వల్లే ప్రభుత్వ కళాశాల రాకుండా అడ్డుపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఐదు మండలాల్లో రైతులు తాము పండించిన కూరగాయలు అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు బజారు నిర్మిస్తామని హామీ ఇచ్చినా దాన్ని ఏర్పాటు చేయలేని అధ్వాన పరిస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉంది. మామిడి తాండ్రకు ప్రసిద్ధి చెందిన భీమాళి, ఆలమండ గ్రామాల్లో దానిని నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోరు. ఎస్‌.కోట – ఆనందపురం మధ్య 18 కిలోమీటర్ల రోడ్డును కూడా బాగు చేయట్లేదు. చంద్రబాబు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా విశాఖ – అరకు రోడ్డును విస్తరిస్తామని చెబుతూనే ఉంటారు. 

అవినీతి.. అవినీతి.. అవినీతి.. 
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే ఎస్‌.కోట నియోజకవర్గంలో అవినీతి.. అవినీతి.. అవినీతి. ఇది తప్ప మరేమీ కనిపించట్లేదు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేయాలంటే ఎకరాకు రూ.10 లక్షల లంచం కట్టాల్సిందే. నీరు – చెట్టు పథకం పేరుతో చెరువుల్లో తాటి చెట్టంత లోతున తవ్వేస్తూ టీడీపీ నాయకులు మట్టి వ్యాపారం చేసుకుంటున్నారని రైతన్నలు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఈ పథకం టీడీపీ నాయకులు దోచుకోవడానికే ఉపయోగపడుతోంది. ఇందులో ఎమ్మెల్యేలు, చిన బాబు, పెదబాబుకు వాటాలు పోతున్నాయి.  

ప్రజలతో కలిసి నడవడం ఓ గొప్ప అనుభవం
3 వేల కి.మీల మైలురాయి దాటడంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి నడవడం ఓ గొప్ప అనుభవమని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి నడవడం ఒక గొప్ప అనుభవం. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజూ నాకు ప్రేరణగా నిలుస్తుంది’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

ఎమ్మెల్సీ కంతేటి వైఎస్సార్‌సీపీలో చేరిక 
ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లిలో సోమవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే పెందుర్తి మండలం సరిపల్లికి చెందిన టీడీపీ యూత్‌ నాయకుడు కరిగి సన్యాసిరావు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు యు.వి.కన్నబాబు, ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్, రాజమండ్రి పార్లమెంట్‌ జిల్లా సమన్వయకర్త కౌర శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top