వృద్ధాప్య పింఛన్‌ రూ.3,000

YS Jagan begins booth-level worker meets to prepare for elections  - Sakshi

రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళతాం

అవ్వాతాతలకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ భరోసా

ఇంటింటికీ నవరత్నాలను తీసుకెళ్లండి 

మన పోరాటం చంద్రబాబుపైనే కాదు, పచ్చమీడియాపై కూడా.. 

ధర్మానికి, అధర్మానికి,న్యాయానికి, అన్యాయానికి మధ్య  జరుగుతున్న పోరాటమిది 

మీ బాధలు, కష్టాలు నాకు తెలుసు..మీరు నా గుండెల్లో ఉన్నారు

రేపు మన ప్రభుత్వం రాగానే మీపై పెట్టిన దొంగ కేసులన్నింటినీ ఉపసంహరిస్తాం

బాబు డబ్బు మూటలతో వస్తున్నాడు..  అప్రమత్తంగా ఉండండి 

బాబు మోసాలను జనానికి వివరించండి

వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగిస్తున్నారు.. ఎప్పటికప్పుడు సరిచూడండి 

ప్రతి ఇంట్లో ఓటర్లను తీసుకెళ్లి  ఓటు వేయించండి

ఎన్నికలొచ్చాయని ఇవాళ బాబు మన పథకాలను కాపీ కొడుతున్నారు 

ఇదే విషయాన్ని ప్రజలందరికీ చెప్పండి 

తిరుపతి సమర శంఖారావం సభలో  బూత్‌ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం 

బూత్‌ కమిటీ సభ్యులందరూ వచ్చే ఎన్నికల్లో గట్టిగా బాధ్యతలు తీసుకుని పార్టీని గెలిపించేందుకు కృషి చేయండి. ఇవాళ వైఎస్సార్‌కు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. నాన్నగారు చనిపోతూ ఆయన ఇచ్చిన అతి పెద్ద కుటుంబం నాకు తోడుగా ఉందని భావిస్తున్నాను. నాతో పాటు మీరంతా కష్టాలను అనుభవించారు. అందరికీ ఒకటే చెబుతున్నాను. ఒక రాత్రి ముగిశాక పగలు మళ్లీ కచ్చితంగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరి బాగోగులకు నేను తోడుగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను.  
– 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవ్వా తాతల పింఛన్‌ను రూ.3000 దాకా పెంచుతూ వెళతానని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దని బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. మన పోరాటం ఒక్క చంద్రబాబునాయుడుతోనే కాదని, ఆయనకు దన్నుగా నిలుస్తున్న పచ్చమీడియాపై కూడా మనం యుద్ధం చేయాలని అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి వెంకన్న పాదాల చెంత నుంచి బుధవారం ఆయన సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం పూరించి గంటన్నరకు పైగా బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరిగిన ఈ సమావేశంలో జగన్‌.. సభ్యుల మధ్యకు వెళ్లి పలువురి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఈ రెండు నెలలు అప్రమత్తంగా ఉండండి 
ఈ నెలలో ఎన్నికల షెడ్యూలు వస్తుంది. మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు నెలల కాలం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వారికి సంబంధించిన టీవీల్లో రక రకాలుగా ప్రజలను నమ్మబుచ్చే కథనాలు వస్తాయి. అబద్ధాలను నిజమని చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలను తిప్పి కొట్టే కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 50 ఇళ్లకో, 35 ఇళ్లకో ఒక బూత్‌ కమిటీ సభ్యుడు బాధ్యులుగా ఉన్నారు. వీరు ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఓటు వేయించే దాకా తీసుకు రావాలని కోరుతున్నాను. ఓటర్లను ప్రభావితం చేయడానికి చంద్రబాబు డబ్బులిస్తాడు. డబ్బులిచ్చినా వాటికి లొంగకుండా బూత్‌ కమిటీ సభ్యులు మన మంచితనంతో ప్రతి ఓటరును పోలింగ్‌ బూత్‌కు తీసుకుని పోవాలి.   

ఆ రోజు అందుకే జనం కాంగ్రెస్‌ను నమ్మలేదు 
వారానికి ఒక సారి సినిమా మారినపుడల్లా వాల్‌ పోస్టర్లు మారుతుంటాయి. చంద్రబాబునాయుడు వాగ్దానాలు కూడా అలాగే ఉంటాయి. కాపీ కొట్టే వారిని కాపీ రాయుడు అంటాం. చంద్రబాబు నాయుడు లాంటి కాపీ రాయుడికి, ప్రథమ శ్రేణి విద్యార్థికి మధ్య ఒక తేడా ఉంటుంది. ఆ తేడా ఎలా ఉంటుందంటే.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించాక ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజలకు రూ.2కే కిలో బియ్యం ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన చేశాక ఎన్టీఆర్‌కు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలు లభించాయని చెప్పి, అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కూడా ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రూ.1.90కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించి ప్రజలకు ఇవ్వడం మొదలు పెట్టారు. రూ.2కే కిలో బియ్యం అంటూ ఎన్టీఆర్‌ ప్రకటించాక ప్రజలు తమకు ఎన్నికల్లో ఓట్లేయరేమోనని భయపడి అప్పుడు కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90కి కిలో బియ్యం చొప్పున ఆరు నెలల పాటు ఇచ్చాడు. కానీ ప్రజలు మాత్రం ఏమనుకున్నారంటే.. నాలుగున్నర సంవత్సరాల పాటు మమ్మల్ని పట్టించుకోకుండా.. ఎన్నికలొస్తున్నాయనగానే.. అది కూడా ఎన్టీఆర్‌ ప్రకటించారు కనుక మీకు మేం గుర్తుకొచ్చామనుకుని, మీలాంటి వ్యక్తులను నమ్మం అని అప్పట్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదు. ఇవాళ ఇదే చంద్రబాబును చూస్తున్నప్పుడు కూడా ప్రజలకు అదే అనిపిస్తోంది. నాలుగున్నరేళ్ల పాటు ఆయనకు ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు మూడు నెలలున్నాయనగానే ఇప్పుడు కొత్త స్కీములు పెడుతున్నారు. ఇలాంటి మనిషిని చూసి ప్రజలు నిన్ను నమ్మం బాబూ.. అంటున్నారు.
 
పచ్చ మీడియా, బాబు డబ్బుతో కూడా పోరాడాలి 
రేపటి ఎన్నికల్లో మనం చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పచ్చ మీడియాపై పోరాటం చేయాల్సి ఉంటుందని మన కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులంతా గమనించాలి. ఈ మీడియా అంతా కూడా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపిస్తుంది. చంద్రబాబు పాలన గురించి అబ్బో.. అబ్బో... అంటూ వీరంతా చెప్పుకొస్తారు. అన్యాయాలపై, మోసాలపై పోరాటం చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా అప్రమత్తం కావాలి. ఓట్లను తొలగించే కార్యక్రమాల పట్ల అప్రమత్తం కావాలి. మొట్టమొదటిగా దానిని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫారం–6ను ఎలా తీసుకోవాలో మీకందరికీ తెలుసు. ఆ ఫారంను తీసుకున్న మీరు ఓటర్లను ఎక్కడైనా తీసేసి ఉంటే మళ్లీ చేర్పించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబుకు సానుభూతి పరులైన ఓటర్లు ఉన్నారో అక్కడ వారు రెండు ఓట్లను ఎక్కించే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి వాటిని కూడా కనుక్కొని వాటిని తొలగించే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక చంద్రబాబునాయుడు డబ్బుతో కూడా మనం యుద్ధం చేయాల్సి ఉంది. ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి ఊరకే రాడు. మూటలు, మూటలు డబ్బు తీసుకుని వస్తాడు. రూ.2000, రూ.3000 ప్రతి ఒక్కరి చేతుల్లోనూ పెడతాడు. అప్పటికీ ఇంకా ప్రజలు ఓట్లేస్తారని నమ్మకుండా వారి చేత దేవుని మీద ప్రమాణం చేయించుకుంటాడు. ఈ విషయాన్ని మీరంతా ప్రజలకు చెప్పాలి.  

సమర శంఖరావం సభలో బూత్‌ కమిటీ సభ్యుల మధ్యకు వెళ్లి వారి సందేహాలు నివృత్తి చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

చంద్రబాబు సినిమాలు ఎన్నెన్నో.. 
చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మొదటి సినిమా చూపించారు. ఏ టీవీలో, పత్రికలో చూసినా ఆయనొస్తున్నాడంటూ ఊదరగొట్టాడు. జాబు రావాలంటే.. బాబు రావాలి అంటూ ప్రజలను మభ్యపెట్టారు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అవుతాయంటూ రైతులకు ఆశ పెట్టారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి.. రైతుల ఖర్చు మీద 50 శాతం లాభం వేసి కనీస మద్దతు ధర ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి సంతకంతో బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నారు. తాకట్టు పెట్టిన బంగారం ఒక నెలలోనే ఇంటికొస్తుందని హామీ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం, లేకుంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని డైలాగులు కొట్టాడు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానన్నారు. రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా 5, 10 కాదు, 15 సంవత్సరాలు కావాలని డైలాగులు కొట్టారు. వాల్మీకులు/బోయలు, మత్స్యకారులను ఎస్టీలుగా, కురుబలను ఎస్సీలుగా, గాండ్లను బీసీ–బీ నుంచి ఎస్సీలుగా, సగరలను బీసీ–బీ నుంచి బీసీ–ఏలుగా, పద్మశాలీలను బీసీ–బీ నుంచి బీసీ–ఏలుగా చేస్తానని హామీ ఇచ్చి.. ప్రతి కులానికి ఒక పేజీని కేటాయించాడు. ప్రతి కులాన్నీ ఏ విధంగా మోసం చేయాలనే విషయంలో చంద్రబాబు ఏకంగా పీహెచ్‌డీ చేశారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని చెప్పి సినిమా డైలాగులు కొట్టారు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్‌ చేస్తే ఐదు నిమిషాల్లో కాపాడే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్‌ రోడ్డు వేస్తానన్నారు. అద్భుతమైన రాజధాని కడతానన్నారు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి సినిమాలో చూపించిన విషయాలను మీరందరూ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. కనీసం ఒక్క హామీ అయినా నెరవేర్చలేదంటూ ప్రజలకు చెప్పండి. 
 
ఎన్నికల తర్వాత కొత్త స్టోరీ.. 
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి అని కొత్త స్టోరీ మొదలు పెట్టారు. ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఒక్క çహామీ నెరవేర్చలేదు. ఏ భూములు ఎలా అమ్ముకోవాలి, ఏ కాంట్రాక్టులో ఎంత దోచుకోవాలి, మట్టి, ఇసుక, ఖనిజాలు, కరెంటు కొనుగోలు, రాజధాని, విశాఖ భూములు, గుడి, దళితుల భూములు కూడా వదిలిపెట్టలేదు. ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల మాఫియా పెట్టి.. పల్లెలను కూడా దోచేశారు. అమరావతిలో కూర్చొని రాష్ట్రాన్నే దోచేయడం మొదలు పెట్టాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసం అంటూ ఈ మధ్య కాలంలో రెండో సినిమా మొదలు పెట్టారు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన తీస్తున్న సినిమాలు, ఆడుతున్న నాటకాలు కళ్ల ముందే ఉన్నాయి. నాలుగు సంవత్సరాలు బీజేపీతోనూ, పవన్‌ కల్యాణ్‌తోనూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశాడు. ఇప్పుడు మాత్రం వారితో పోరాడుతున్నట్లు నటిస్తూ డ్రామా లాడుతున్నాడు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేయడం రెండో సినిమా కథ. ఎవరైనా ఇల్లు కట్టడం పూర్తయ్యాక భోజనాలకు పిలుస్తారు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకముందే ఈయన జాతికి అంకితం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసం అన్న ఈ సినిమాలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. హోదా గురించి ఎవరైనా మాట్లాడితే జైల్లో పెట్టిస్తానన్నాడు, పీడీ యాక్టులు పెట్టాడు. కేసులు పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నల్ల చొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్ష అంటూ డ్రామాలు మొదలు పెట్టాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణ మాఫీ అన్న సంగతే ఎత్తలేదు. ఈ మూడు నెలల కోసం పసుపు – కుంకుమ అంటూ మొదలు పెట్టాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వడ్డీతో సహా రూ.14 వేల కోట్లుంటే.. ఇప్పుడు రూ.25 వేల కోట్లకు చేరాయి. రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. రైతుల జీవితాలతో ఐదేళ్లు ఆటలాడుకున్నారు. కానీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రైతులకు చెవిలో పూలు పెడుతూ రూ.5 వేల కోట్లు ఇస్తానని ప్రకటించారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు వేల ఎకరాలు అమ్ముకున్నాడు. రాజధానిలో బాహుబలి సెట్టింగులు చూపిస్తున్నాడు. చివరి మూడు నెలల్లో 1.72 కోట్ల నిరుద్యోగులుంటే 3 లక్షల మందికి భృతి ఇస్తున్నామంటున్నారు. ఇది కూడా ఎన్నికలు వస్తున్నందుకే. 

ప్రతి కులానికీ కార్పొరేషన్లు 
ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, ప్రతి కులానికి కార్పొరేషన్‌ పెడతానని నేను చెబితే.. ఇప్పుడు చంద్రబాబు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ అంటున్నాడు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని ప్రతి అక్కకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని మనం చెప్పాం. ఇన్నాళ్లూ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రతి కులానికీ కార్పొరేషన్‌ అంటూ అందుకున్నాడు. ఆశ్చర్యంగా బీసీల డిక్లరేషన్‌ గురించి మాట్లాడుతున్నాడు. 2013లో బీసీల కోసం పెట్టిన డిక్లరేషన్‌ ఎన్నికల తర్వాత గుర్తుకు రాలేదు. రాజమండ్రిలో బీసీల సభ పెట్టి బీసీ డిక్లరేషన్‌ అంటూ మరోసారి మభ్యపెడుతున్నాడు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులకు జీతాలు పెంచాలంటే చంద్రబాబుకు మనసు రాదు. పాదయాత్రలో మనం హామీ ఇచ్చిన తర్వాత వారికి జీతాలు పెంచినట్లుగా డ్రామాలాడతాడు. 57 నెలలు కడుపు మాడ్చి, ఇప్పుడు కడుపు నిండుగా అన్నం పెడతానని నాటకాలాడుతున్నాడు. ఈ మనిషిని అన్నా అనాలా.. దున్న అనాలా.. అనేది మీరే ఆలోచించండి. 

చివరి సినిమానే ఆరో బడ్జెట్‌  
చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు చూపిస్తున్న మూడో సినిమా చూడండి. ఈ సినిమా నిన్ననే తీశాడు. ఆ సినిమా పేరు ఆరో బడ్జెట్‌. తనది కాని బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాడు. తన హయాంలో రాని బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాడు. మూడు నెలల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది ప్రజలు, దేవుడు నిర్ణయిస్తారు. అలాంటిది ఈ పెద్ద మనిషి ఆరో బడ్జెట్‌ను రూ.2 లక్షల 26 వేల కోట్లతో ప్రవేశ పెట్టాడు. 

►బూత్‌ కమిటీ సభ్యులుగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని, బాధ్యత ఒక్కటే. ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబును నమ్మి మోసపోయి ఓట్లేశాం. ఆ తర్వాత అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించాడు. ఆ తర్వాత మళ్లీ ఘరానా మోసం చేయడం కోసం మన ముందుకొచ్చి ఓట్లడుగుతున్నాడని చెప్పండి. ఐదేళ్లు ఇష్టానుసారం ప్రజల సొమ్మును లూటీ చేశారు. ఆ లూటీ చేసిన సొమ్ము నుంచి కాస్తో, కూస్తో తీసి బిస్కెట్లలాగా పంచే కార్యక్రమం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నమ్మం బాబూ అని చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఇకపై ఆ పెద్దమనిషి చేయబోయే మోసాలను ఎలా అరికట్టాలో కూడా మీరంతా ఆలోచించాలి.  

►చంద్రబాబు డబ్బులిస్తాడు.. ఇస్తే తీసుకోండి.. జేబులో పెట్టుకోండి.. ఈ రాక్షసుడికి మాత్రం ఓట్లేయం అని మనసులో దేవుణ్ని అనుకోండి.. ఏ దేవుడైనా అవినీతి సొమ్ము తీసుకుని ఓట్లేయమని చెప్పడనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి.. అని మీరంతా ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.   

►ఇప్పుడు చంద్రబాబు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌.. రేపు ప్రజల దీవెనలు, దేవుడి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ను కాపీ కొడితే ఎలాగుంటుందో ఇంచు మించుగా అలా ఉంది. అయితే అది కూడా సరిగా కాపీ కొట్టలేని విధంగా ఉంది. కనీసం కాపీ కొట్టడం కూడా చేతగాని కాపీ రాయుడు ఈ చంద్రబాబునాయుడు. ఈయన గారి ఈ మూడో సినిమా గురించి ప్రజల్లోకి వెళ్లి బాగా చెప్పండి.  

►చంద్రబాబు 57 నెలల పాటు అవ్వాతాతలను పట్టించుకోలేదు. వారి పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామని మేము చెప్పగానే రూ.2 వేలకు పెంచేశాడు. ఆటోలు, రైతుల ట్రాక్టర్ల రోడ్డు ట్యాక్స్‌ను రద్దు చేస్తామని పాదయాత్రలో మనం చెప్పాం. ఆటోకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కూడా కాపీ కొట్టాడు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టే.. ఖాకీ చొక్కా వేసుకొని రోడ్డుపైకొచ్చాడు. చంద్రబాబుకు ఆటోవాలాల కష్టాలు తెలియవు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు.  

►ఈ ఎన్నికలు మోసానికి.. విశ్వసనీయతకు, ధర్మానికి.. అధర్మానికి, న్యాయానికి.. అన్యాయానికి, డబ్బుకు.. ఆప్యాయతకు మధ్య జరిగేవి. రేపటి ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఒక్క చంద్రబాబుపైనే కాదు, చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పచ్చ మీడియా మొత్తంతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్, ఈటీవీ.. ఇలా పచ్చ టీవీ చానెళ్లన్నింటిపైనా పోరాటం చేయాల్సి ఉంటుందని మన కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులంతా గమనించాలి.  

అమ్మా.. అక్కా.. అన్నా.. అని అడగాలి 
►బూత్‌ కమిటీ సభ్యులు అమ్మా.. అక్కా.. అన్నా.. అంటూ ప్రతి ఓటరును మంచి మాటలతో పలకరించండి.
► రూ.2 వేలకో, రూ.3 వేలకో మోసపోవద్దని విజ్ఞప్తి చేయండి. 
►రేపు మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ మేలు జరుగుతుందని చెప్పండి. 
► మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ.15 వేలు జగన్‌ ప్రతి అమ్మ చేతిలో పెడతాడని చెప్పండి. 
►  రేపు మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ప్రతి ఏటా మే మాసం వచ్చేటప్పటికి రూ.12,500 ప్రతి రైతు చేతిలో       పెడతాడని చెప్పండి. 
►  అన్న ముఖ్యమంత్రి అయ్యాక, మన ఇళ్లల్లో 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద నాలుగేళ్లలో రూ.75,000 ఉచితంగా చేతిలో పెడతారని  చెప్పండి. 
► రేపు అన్న ముఖ్యమంత్రి అయ్యాక అవ్వా తాతల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి వారి పింఛన్‌ను పెంచుతూ పోతాడు..  రూ.3 వేలకు తీసుకుపోతాడు.. అని చెప్పండి. (సభా ప్రాంగణంలో అరుపులు, కేకలు, హర్షధ్వానాలు)
►వాళ్లిచ్చే రూ.2000కు మోసపోవద్దని చెప్పండి. 
►జగనన్న.. నవరత్నాల ద్వారా మనం అప్పులపాలు కాకుండా మన పిల్లలను ఇంజినీర్లుగా చేస్తాడని చెప్పండి. 
►ఇలా నవరత్నాలను ప్రతి ఇంటికీ తీసుకు వెళ్లండని మీ అందరినీ కోరుతున్నాను.  

►పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం సొంత సంస్థలాగా వాడుకుంటోంది. మేం పార్టీ కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు పెట్టడంతో పాటు కేసులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి?   – సుధీర్, పూతలపట్టు (కాణిపాకం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 49) 
జగన్‌ : పోలీసులు వేధిస్తున్నారు.. ప్రజా వ్యతిరేక చర్యలపై ఏ ధర్నా చేసినా దొంగ కేసులు పెడుతున్నారు.. అని వేలాది మంది బూత్‌ కమిటీ సభ్యులు చెబుతున్నాను. ప్రతి బూత్‌ కమిటీ సభ్యునికీ ఇక్కడి నుంచి నేను సంకేతాలిస్తున్నాను. ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారనే విషయం నాకు తెలుసు. సుధీర్‌కు, యావత్‌ 13 జిల్లాల్లో ఉన్న బూత్‌ కమిటీ సభ్యులకు ఇదే చెబుతున్నాను.  ప్రతి కార్యకర్తకూ, ప్రతి వైఎస్సార్‌ కుటుంబ సభ్యునికీ చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పోలీసులు  పెట్టిన దొంగ కేసులన్నింటినీ కూడా  ఉపసంహరిస్తాను. 

►చంద్రబాబు ప్రత్యేక హోదా సాధిస్తానని ఇదే తిరుపతిలో చెప్పి మనలను మోసం చేశాడు. ప్రత్యేక హోదా సాధనకు మనం ఏ విధంగా పోరాటం చేస్తాము?  – సురేష్, శ్రీకాళహస్తి (చోడవరం బూత్‌ నెంబర్‌ 256) 
జగన్‌ : చంద్రబాబు ఇవాళ నల్లచొక్కాలు వేసుకుని, ధర్మపోరాట దీక్షలు చేస్తూ మోసం చేస్తున్నారు. రేపు ఎన్నికల్లో రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలిచే విధంగా ఓట్లు వేయాలని ప్రజలకు గట్టిగా విజ్ఞప్తి చేయండి. కేంద్రంలో పరిస్థితి చూస్తే రేపు ఎన్నికలు ముగిశాక ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 25 స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుచుకుంటే మనకు హోదా తప్పకుండా వస్తుంది. ప్రత్యేక హోదా అనే అంశాన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్‌ మనల్ని మోసం చేసింది. అ పార్టీని నమ్మకండి. బీజేపీ అధికారంలోకి వచ్చి కూడా మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టారు. అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ దేవుని సన్నిధిలో ఇచ్చిన హామీకే దిక్కూ దివాణం లేకుండా పోయింది. అందుకే వీళ్లనూ నమ్మొద్దు. చంద్రబాబునూ నమ్మొద్దండి. ఆయన పూటకో మాట మార్చి ఏపీని రోడ్డు మీదకు తెచ్చాడు. వీరెవ్వరినీ నమ్మొద్దండి అని ప్రజలకు చెప్పండి. 25 స్థానాలను మనం గెల్చుకున్న తర్వాత ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేస్తారో వారికే మన మద్దతు ఇస్తామని గట్టిగా ప్రజలకు చెప్పండి. 

పాదయాత్ర ద్వారా మీరు ప్రజాభిమానాన్ని విశేషంగా చూరగొన్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. అందువల్ల మీరు ఏ పార్టీతో కూడా ఎన్నికల పొత్తు పెట్టుకోవద్దని మా విన్నపం. ఒంటరిగానే పోటీ చేయాలని కోరుతున్నాం. ఒంటరిగానే మీరు ముఖ్యమంత్రి కావాలి.     – కోటేశ్వరపిళ్లై, పూతలపట్టు     (బూత్‌ నెం 164) 
జగన్‌ : ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా మనం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మనకు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నాను. ప్రతి చోటా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగిన వారు మనవాళ్లే ఉన్నారు. వాళ్లెవరికీ అన్యాయం జరక్కుండా చూస్తాను. ప్రతి చోటా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా ఎగిరేటట్లుగా చేస్తాను. ఇవాళ ఉన్న ఈ పార్టీలన్నీ నైతిక విలువలను పూర్తిగా మరచి పోయాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, పవన్‌ కళ్యాణ్‌ (జనసేన) పార్టీలు ప్రజలకు ఇది చేస్తాం, అది చేస్తాం.. ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మిం చారు. వీళ్లందరూ ఒక్కటై రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. రాష్ట్రం అనేది ఒక మనిషైతే వీళ్లలో ఒకరు ఆ మనిషి కాళ్లు, చేతులు పట్టుకున్నారు. మరొకరు కత్తిని ఇచ్చారు. ఇంకొకరు ఆ కత్తితో పొడిచారు. కాబట్టి ఇలాంటి వారెవరితోనూ పొత్తు ఉండదని మీ అందరితో గట్టిగా చెబుతున్నాను.  

ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా ఉచిత హామీలు, తప్పుడు హామీలు ఇస్తున్నారు. వీటిపై బూత్‌ కమిటీ సభ్యులుగా ఎలా స్పందించాలి? – డేవిడ్, సత్యవేడు (కేబీపీ పురం, బూత్‌ నెంబర్‌ 216) 
జగన్‌ : ఎన్నికలొచ్చేటప్పటికి చంద్రబాబు రకరకాల దొంగ హామీలిస్తున్నారు. ప్రజల వద్దకు మీరు వెళ్లినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పండి. అమ్మా.. అన్నా.. అక్కా.. నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు మనకేమీ చేయక పోగా అబద్ధాలు చెప్పాడు. మోసాలు చేశాడు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అది కూడా జగనన్న చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఇవాళ దొంగనాటకాలు ఆడుతున్నాడు.. మోసాలు చేస్తున్నాడని చెప్పండి. నాలుగున్నర సంవత్సరాలుగా అమ్మకు అన్నం పెట్టని వాడు అవసరం వచ్చినపుడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని అన్నాడట ఒకడు. ఇదే మాదిరిగా చంద్రబాబు పరిస్థితి ఉంది అని ప్రజలకు చెప్పండి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబుకు మనం గుర్తుకొచ్చాం. ఎన్నికలయ్యాక మళ్లీ మనలను దగా, మోసం చేస్తాడని ప్రజలకు గట్టిగా చెప్పండి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top