సీమపై వివక్షకు గుణపాఠం తప్పదు

y visweshwar reddy fires on tdp government - Sakshi

ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం టౌన్‌: అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ రాయలసీమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష  చూపుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల నిరాహార దీక్షను ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే రాయలసీమలో హంద్రీ నీవా నీరు పారుతోందని గుర్తు చేశారు. మొదటి దశలో 95శాతం పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి కాగా మిగిలిన 5శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి నీళ్లు తామే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేంద్రం రూ.50కోట్లు కేటాయిస్తే వాటిని సైతం వినియోగించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయరాదని శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు స్పష్టమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. గతంలోనే అసెంబ్లీలో సైతం రాయలసీమ వెనుకబాటుపై స్పీకర్‌కు నోటీసులు ఇచ్చి ప్రస్తావించామని గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోరాట ఫలితంగా హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులను నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రకటించారన్నారు. ఏటా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించడమే తప్పా వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమరావతి, పట్టిసీమపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదన్నారు. ఇదే దోరణిలో వ్యవహరిస్తే రాయలసీమ వాసులు గణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ అభివృద్ధి  సాధ్యం అవుతుందన్నారు. జలసాధన సమితి నాయకులు దశరథరామిరెడ్డి, రామ్‌కుమార్, రాయలసీమ వియోచన సమితి నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రాజేంద్ర, సీమకృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top