ఆ స్థానంలో తొలిసారి మహిళ పోటి..

Woman's First Time In That Place - Sakshi

తూర్పు గోదావరిలో గీతమ్మ... గీతక్కగా ఆమె అందరికీ సుపరిచితురాలు. ఏంటన్నా.. ఎలా ఉన్నావు.. ఏంటమ్మా ఏం చేస్తున్నావు..? అంటూ సొంత మనిషిలా ఆప్యాయంగా పలకరించే మానవతా విలువలున్న రాజకీయ నేతగా, అన్యాయాన్ని ఎదిరించే న్యాయవాదిగా పేరు పొందారు. ప్రజలకు సమ న్యాయాన్ని అందించాలన్న దృక్పథంతో న్యాయవాద పట్టాను పొందినా కొద్ది రోజుల్లోనే అనుకోని అవకాశంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె అనతికాలంలోనే మహిళా రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు.న్యాయవాదిగా నాలుగేళ్లు నిరుపేదలకు చేసిన సేవ ఆమెను ప్రజలకు చేరువ చేసింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే గుణం ఉన్న ఆమెను రాజకీయాలు ఆహ్వానించడంతో ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.కాకినాడలో తొలిసారి మహిళకు ఎంపీగా పోటీచేసే అవకాశం జగన్‌ ఇచ్చారు.  జగన్‌ అడుగుజాడల్లో ప్రయాణిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానంటున్న కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్‌ అంతరంగం ఆమె మాటల్లోనే..

‘‘మా స్వస్థలం కాకినాడ. చిన్ననాటి నుంచి నల్లకోటు వేసుకునేవాళ్లను చూసి నేనూ నల్లకోటు వేసుకుని కోర్టుకు వెళ్లాలి.. పేదలకు సాయం, సేవ చేయాలని ఉత్సాహపడేదాన్ని. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంఏ, బీఎల్, ఎంఏ సైకాలజీ చదివి న్యాయవాదిగా నాలుగేళ్లు ప్రాక్టీస్‌ చేశా. నా ఉన్నత విద్య, నేను న్యాయవాదిగా ప్రజలకు చేస్తున్న సేవలు చూసిన నేతలు నన్ను రాజకీయాల్లోకి రావాలని సూచించారు. 1983లో ప్రారంభమైన నా రాజకీయ ప్రస్థానం గత ఐదేళ్ల క్రితం వరకు నిరంతరాయంగా కొనసాగింది. 1985–87 మహిళా శిశు సంక్షేమ మండలి రీజనల్‌ చైర్మన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995–2000 తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2000–2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా, 2009–2014 పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించా. 

అక్కా అంటూ అంతా ఆదరిస్తారు
జెడ్పీ చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా చేసిన సేవలతో పాటు నా బంధువులు, స్నేహితులు, రాజకీయ నేతలు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జిల్లాలో ఎక్కడికెళ్లినా అందరూ పలకరిస్తారు. కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మరింత పరిచయాలున్నాయి. ఇక్కడి ప్రజలు నాకు చేరువగా ఉంటారు. అక్కా అంటూ ఏ కష్టమొచ్చినా నా దగ్గరకు వస్తారు.  పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లు ప్రజలంతా నన్ను మంచి నేతగా గుర్తించారు. వారి అభిమానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రత్యేక హోదా పోరులో చాలా చురుకుగా పాల్గొన్నా. రాజకీయపరంగా ప్రజా ప్రతినిధిగా లేకపోయినా ప్రజల ప్రతినిధిగా నిత్యం ప్రజల్లోనే ఉన్నా.. ఎప్పటికీ ఉంటా. ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పోరాట పటిమ నాకు స్ఫూర్తిగా నిలిచింది. ఆయన నాయకత్వంలో పనిచేయాలని భావించా. ఉన్నత చదువులు చదువుకుని భవిష్యత్తు ఆనందమయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, జగన్‌ మాత్రం ప్రజల కోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని అంకితమిచ్చి తన తండ్రి ఆశయాలకు ప్రాణం పోస్తున్న తీరు నన్ను ఆయనతో ప్రయాణించేలా చేశాయి. 

కాకినాడను అభివృద్ధి చేస్తా
కాకినాడలో తొలిసారి మహిళకు ఎంపీగా పోటీచేసే అవకాశం జగన్‌ ఇచ్చారు. నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని కబురు తెలియగానే పనిచేసేవారికి జగన్‌ ప్రాధాన్యత ఇస్తారనేది నిజమనిపించింది. ఆయన నాకు అవకాశం ఇచ్చారనగానే చాలా సంతోషం కలిగింది. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసినా, ఇప్పుడు నేరుగా పార్లమెంట్‌లో జగన్‌ ఆశయాల సాధనకు పాటుపడవచ్చు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన జగన్‌ జీవితాశయం కాబట్టి దాని సాధనకు నావంతు కృషి చేయవచ్చు. రాష్ట్రానికి కావాల్సిన విద్యా, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ తదితర రంగాలకు ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు కృషి చేసి జగన్‌ ఆశయాలను నెరవేర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నించవచ్చు. అన్ని రకాల ప్రకృతి వనరులు ఉన్న కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చు. జగన్‌ సారధ్యంలో ఆయన నాయకత్వంలో అభివృద్ధి సాధనకు కృషి చేస్తా. మహిళలకు పార్లమెంట్‌లో సముచిత స్థానం కల్పించాలన్న దృక్పథంతో ఆయన నాకు సీటు కేటాయించిన తీరు.. మహిళాలోకం యావత్తూ హర్షిస్తూ జగన్‌కు మద్దతుగా నిలుస్తోంది. 

మడమ తిప్పని నాయకుడు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మృతితో రాష్ట్ర ప్రయోజనాల కోసం, వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం జగన్‌ రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది. అప్పటినుంచి అన్ని రాజకీయ శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా వెనుకడుగు వేయకుండా మడమతిప్పని నాయకుడిగా పోరాటం చేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి కోట్లమంది ప్రజల సమస్యలను కళ్లారా చూసి వాటి పరిష్కారం కోసం, నవరత్నాలు పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆయన అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు’’?
–వి. సూర్య వెంకట సత్య వరప్రసాద్‌ పిఠాపురం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top