ప్రోటెం స్పీకర్‌ ఎవరు?

Who will be the Pro-tem Speaker? - Sakshi

సాక్షి,  బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పదవికి బీజేపీ నేత ఎంపికవుతారా లేక కాంగ్రెస్‌ నేత ఎన్నికవుతారా అనేది కీలక చర్చగా మారింది.  ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం కాం‍గ్రెస్‌కు చెందిన ఆర్వీ దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికయితే..  బలపరీక్ష నిరూపించుకునే సమయంలో యడ్యూరప్పకు మరో తలనొప్పి తప్పదా   అనే చర్చ కూడా తీవ్రంగా నెలకొంది. అంతేకాదు శనివారం నాటి  ఫ్లోర్‌ టెస్ట్‌లో ఫలితం  టై  అయిన  సందర్భంలో  తాత్కాలిక స్పీకర్‌ ఓటు నిర్ణయాత్మకం కానుంది.  ఈ నేపథ్యంలో  ప్రోటెం  స్పీకర్‌ ఎంపిక హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

చట్టప్రకారం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికవుతారు. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశేపాండే  తాత్కాలిక  స్పీకర్‌గా  ఎంపికయ్యే అవకాశం ఉంది.  ఈ నియామకాన్ని  గవర్నర్  చేపడతారు.   తాత్కాలిక ప్రాతిపదికన లేదా, అసెంబ్లీ   స్పీకర్‌ ఎంపిక పూర్తయ్యేదాకా ఆయన పదవిలో ఉంటారు.  కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా  ప్రోటెం స్పీకర్‌ చేపడతారు.  ఇది ఇలా ఉంటే కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్ వీ దేశ్ పాండ్ పేరును తాత్కాలిక స్పీకర్ గా గవర్నర్ కు సిఫారసు చేసింది.

మరోవైపు ప్రో-టెం స్పీకర్‌గా  ఎంపిక అయ్యే అర్హత తనకే వుందని  కాంగ్రెస్ నేత దేశ్‌పాండే  చెబుతున్నారు.  తానే ఈ పదవికి ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. సుప్రీం ఎలాగూ సీ‍క్రెట్‌ ఓటింగ్‌పై స్పష్టత ఇచ్చింది కనుక వాయిస్ ఓట్‌, లేదా ఓట్ల విభజన ద్వారా బలనిరూపణ ఉండే అవకాశం ఉందన్నారు. దేశ్‌పాండే 1983 నుండి ఎన్నికలలో తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఎనిమిది సార్లు విజయం సాధించారు.   ఇక​ ఈ వరుసలో  బీజేపీకి  చెందిన ఉమేష్ విశ్వనాథ్ కట్టి కూడా రెండవ సీనియర్‌గా రేసులో ఉన్నారు.   1985 నుండి ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పాల్గొనగా ఏడుస్లారు అసెంబ్లీకి ఎంపికయ్యారు. 

కాగా ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఖంగుతున్న బీజేపీకి కాంగ్రెస్‌  సీనియర్‌ దేశ్‌పాండే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికయితే  మరో ఎదురు దెబ్బ తప్పదనీ  యడ్యూరప్ప  బల నిరూపణ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  తాత్క​లిక స్పీకర్‌ ఎంపికపై చర్చించేందుకు  కర్ణాటక గవర్నర్‌  రాజ్యాంగ నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top