‘దేశం’ కోటలకు బీటలు.. పశ్చిమగోదావరిలో అవినీతి రాజ్యం

West Godavari District The Symbol Of Political Consciousness is Calm - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు రాజకీయ చైతన్యానికి ప్రతీక.. పల్లెసీమలకు నిలయం.. అదే పశ్చిమగోదావరి జిల్లా.. అయితే జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించే పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం సీట్లన్నీ గెలిచినా టీడీపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. అన్ని స్థానాలలో విజయం సాధించి ఎన్నికల ఫలితాలను రివర్స్‌ చేసేలావైఎస్సార్‌ సీపీ దూసుకుపోతోంది.

రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో ఇసుక దోపిడీతో మొదలైన  పాలన ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది.  ప్రతి పనీ తమ వాళ్లకు అప్పగించి కమీషన్లు తీసుకోవడంపైనే అధికార పక్ష ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాను ఒక రౌడీ రాజ్యంగా మార్చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా సాగలేదు. పోలవరం అయినా పూర్తి చేసిందా అంటే అదీ లేదు. జిల్లాకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.

 పట్టిసీమ పేరుతో నీరు ఇష్టారాజ్యంగా తరలించి డెల్టాను ప్రమాదంలో పడేసింది. వ్యవసాయంగిట్టుబాటవ్వక రైతాంగం ఆక్వావైపు చూస్తోంది. ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పటికే మూడు లక్షల ఎకరాల ఆయకట్టు చెరువులుగా మారిపోయింది.  కాలువలు, వాగులనూ, ఆఖరికి పోలవరం కుడికాల్వ గట్టుని కూడా వదలకుండా తవ్వేసి గోదావరికి గుండెకోత మిగిల్చారు. గోదావరి కాకుండా తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువలను సైతం విడిచిపెట్టకుండా కోట్లు కూడబెట్టుకున్నారు. జిల్లాలో ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్‌ స్థానాల పరిధిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాలు వస్తాయి.
నర్సాపురం నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు, ఆచంట వస్తాయి
.
రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోకి నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు వస్తాయి.
గత ఎన్నికల్లో ఏలూరు, రాజమండ్రి నుంచి తెలుగుదేశం అభ్యర్ధులు గెలవగా, నర్సాపురం
మిత్రపక్షాల పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది. 

... ఆచంట
మాజీ ఎమ్మెల్యే  శ్రీరంగనాథరాజు ఆచంట వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా ఉన్నారు.  ఏడాదికాలంగా ప్రజల మద్య ఉంటూ వారి అవసరాలను సొంత డబ్బు తో నెరవేరుస్తున్నారు. తెలుగుదేశం తరపున పితాని సత్యనారాయణ రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారు. రెండుసార్లు గెలిచినా ప్రజలకు ఏం చేయలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ఉంది.

... నర్సాపురం
కాపుల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అయిన నర్సాపురంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి సీటు తనదే అని చెబుతుండగా, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్, కొత్తపల్లి సుబ్బారాయుడు తాను కూడా లైన్‌లోనే ఉన్నానంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో జనసేన కూడా ఆశలు పెట్టుకుంది.

... చింతలపూడి
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసి స్వచ్ఛంద విరమణ చేసిన వీఆర్‌ ఎలీజా  ఉన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అండగా ఉంటున్నారు. టీడీపీ మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాతను తప్పించి కర్రా రాజారావుకు టీడీపీ టికెట్‌ ఇచ్చారు.  

... దెందులూరు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన దగ్గర నుంచి దళితులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడం వరకూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రతినిత్యం వార్తల్లో నిలిచారు. చింతమనేనిని ఢీకొట్టడానికి ఎన్‌ఆర్‌ఐ, యువకుడు అయిన  కొఠారు అబ్బయ్య చౌదరిని వైఎస్సార్‌ సీపీ రంగంలోకి దింపింది. ఈసారి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చింతమనేని ఓటమి ఖాయమే అవుతుంది. 

... భీమవరం  
రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి ఆంజనేయులు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సీటు తన కుమారుడికి ఇప్పించుకోవడానికి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది.  వైఎస్సార్‌ సీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఈసారి ఎలాగైనా భీమవరం సీటు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 

... ఏలూరు 
ప్రశాంతంగా ఉండే ఏలూరు గత ఐదేళ్లలో రౌడీరాజ్యంగా మారిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి అరాచక శక్తులను పెంచిపోషిస్తుండటంతో ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఆళ్ల నానిని వైఎస్సార్‌సీపీ రంగంలోకి దింపింది. ఏలూరు మేయర్‌ నూర్జహాన్, అమె భర్త కో–ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం బలంగా మారింది.

... గోపాలపురం
టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఈసారి మార్పునకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావుపై ఉన్న వ్యతిరేకత.. ఆయనకు సీటు ఇవ్వద్దంటూ ప్రత్యర్ధి వర్గం గొడవలతో ఈసారి ఇక్కడ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనపడుతోంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న తలారి వెంకట్రావు ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థ్ధిగా ఉన్నారు. 

... తాడేపల్లిగూడెం 
2014లో ఎన్నికల్లో బీజెపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు గెలిచారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజు మాణిక్యాలరావుకు ప్రతి నిమిషం అడ్డుపడుతూనే వచ్చారు. సీఎం చంద్రబాబు బాపిరాజుకు చెయ్యిచ్చి ఈలి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తిరుగుబావుటా ఎగరవేయగా, మున్సిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ జనసేన తీర్ధం పుచ్చుకుని పోటీకి సిద్ధమయ్యారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఉన్నారు.  

... కొవ్వూరు 
ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన  మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అతనిని మార్చాల్సిందేనని పార్టీలోని మెజారిటీ నాయకులు పట్టుబట్టారు. దాంతో పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టికెట్‌ ఇచ్చారు.  వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలపై ఉద్యమిస్తూ ఈసారి టీడీపీ కోటను బద్దలుకొట్టేందుకు
సన్నద్ధం అవుతున్నారు. 

... ఉండి 
టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు తీరు పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. తనకు ఎదురుతిరిగిన వారిపై పోలీసులను ఉసిగొల్పి వేధిస్తారన్న పేరుంది. ౖవైఎస్సార్‌సీపీ నుంచి పీవీఎల్‌ నరసింహరాజు రంగంలో ఉన్నారు. పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రఘురామకృష్ణంరాజుది కూడా ఈ నియోజకవర్గమే.

... నిడదవోలు
ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచేసిన ఘనత ఇక్కడ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకే దక్కుతుంది.  ఇక్కడ ఎవరిని బరిలోకి దింపేది చంద్రబాబునాయుడు ఇంకా నిర్ణయించలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్‌ రావు కుమారుడు శ్రీనివాసనాయుడు రంగంలో ఉన్నారు. 

... పాలకొల్లు 
పాలకొల్లులో రెండురోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇక్కడ వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయమైంది. ఇక్కడ ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తారని పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సీటు ఖరారు చేశారు. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామమోహనరావుకు నిమ్మలకు విబేధాలు పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

... పోలవరం
పోలవరం భూసేకరణ పేరుతో జరిగిన అవినీతి, గిరిజనులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగించిన అకృత్యాలతో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోని వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజు రంగంలో ఉన్నారు.

... తణుకు
తన మాట వినలేదని సాక్షాత్తు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నే కింద కూర్చొపెట్టిన ఘనత ఉన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ మాజీ జెడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 

... ఉంగుటూరు 
ఇక్కడ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా ఉన్న పుప్పాల వాసుబాబు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన గన్ని వీరాంజనేయులు పేకాట క్లబ్లుల నిర్వహణ, అక్రమ ఆక్వా చెరువులు, కొల్లేరు ఆక్రమణలతో ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top