ప్రజాస్వామ్యం పరువు తీసిన తృణమూల్‌

West Bengal Panchayat Polls Reflect A Throttling Of Democracy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకటిలాగే ఈసారి కూడా పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హింసాకాండ చెలరేగింది. సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా ఉత్పన్నమైన హింసాకాండలో దాదాపు 18 మంది మరణించారు. రాష్ట్రంలో హింసాకాండ పెరగలేదని వాస్తవానికి తగ్గిందంటూ ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తిప్పి కొడుతోంది. 2003లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 61 మంది మరణించారు. ఆ విషయంతో పోలీస్తే హింసాకాండ తగ్గింది. అంతమాత్రాన ఎన్నికలు సవ్యంగా జరిగాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేసినట్లు భావించలేం. తొలి ఓటు కూడా వేయకముందే 34 శాతం పంచాయతీలను ఎలాంటి పోటీ చేయకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోవడమే అందుకు కారణం.

ఇతర రాజకీయ పార్టీలకు సంస్థాగత బలం లేకపోవడం వల్ల ఈ 34 శాతం పంచాయతీల్లో పోటీ చేయలేకపోయిందని, అందుకనే పోటీ లేకుండా తమ పార్టీ విజయం సాధించినదని పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థించుకుంటోంది. కానీ ఎవరిని పోటీ చేయకుండా బెదిరించడం వల్లనే పోటీ లేకుండా పాలకపక్షం గెలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించిన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తృణమూల్‌ కాంగ్రెస్‌లో అభద్రతా భావం ఏర్పడిందని, అందుకనే తృణమూల్‌ బీర్భమ్‌ జిల్లాలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వారంటున్నారు. ఈ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలను పోటీ లేకుండా తృణమూల్‌ కైవసం చేసుకుంది.

2019లో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీని అడ్డుకునేందుకు తృణమూల్‌ తీవ్రంగా కృషి చేసింది. ప్రజాస్వామ్యం బూడిదపై రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం మంచిదికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top