అన్నదాతకు అండగా ఉంటాం

We will be support to the farmers says Harish rao - Sakshi

     నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

     సిద్దిపేట జిల్లాలో వడగళ్లవానకు దెబ్బతిన్న పంటల పరిశీలన  

     సాయంపై సీఎం కూడా

    సానుకూలంగా ఉన్నారని వెల్లడి 

సాక్షి, సిద్దిపేట: ‘అయ్యా.. నాకున్న ఎకరంలో వరి సాగుచేశా. నీరు సరిపోకపోయినా వరుస తడులు పెట్టా. ఇప్పటి వరకు రూ.25 వేల పెట్టుబడి అయ్యింది. మాయదారి వర్షం వచ్చి మమ్ముల్ని నట్టేట ముంచింది. వడ్లన్నీ రాలిపోయినయి. మీరే దిక్కు..’అంటూ సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచప్యాల గ్రామానికి చెందిన రైతు బోనాల దర్గయ్య రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముందు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన మంత్రి.. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సిద్డిపేట జిల్లాలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్నచేలు, కూరగాయలు, మామిడి తోటలను సోమవారం హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వాన కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి తెలిపారు. వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌తో ఇప్పటికే చర్చించామన్నారు. సీఎం సైతం సానుకూలంగా ఉన్నారని.. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వీలైనంత త్వరగా రైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టంపై పూర్తి స్థాయి సమాచార సేకరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి బాధ్యతలు అప్పగించామని చెప్పారు.

ఈలోపే పంటనష్టాన్ని అంచనా వేసేలా బీమా కంపెనీలను ఆదేశించామని వెల్లడించారు. ప్రతీ సెంటు పంట నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుని రైతులను ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top