అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు! | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

Published Tue, Jul 23 2019 11:32 AM

Video Played in AP Assembly Exposes Chandrababu Lies - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి.. తానే అడ్డంగా బుక్‌ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి పెన్షన్‌ ప్రకటనపై ఓ పేపర్‌ కటింగ్‌ను చూపిస్తూ.. ఆ పార్టీ నేతలు రాద్ధాంతం చేశారు. ఇదే అంశంపై అధికార పక్ష సభ్యులు పదే పదే వివరణ ఇచ్చినా.. స్వయంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను సభలో చదివి వినిపించినా.. దీనికి సంబంధించిన వీడియోను రెండుసార్లు చేసినా చంద్రబాబు అదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక పేపర్‌ కటింగ్‌పై ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కూడా సూచించారు. అయినా, చంద్రబాబు తీరు మారకపోవడంతో.. సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించుకొని.. ఈ విషయమై పూర్తి  స్పష్టత ఇచ్చారు. 

ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్‌ కటింగ్‌ 18-10-2017నాటిదని, ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్‌ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సభాపతి అనుమతితో సభలో ప్లే చేయించారు. ఈ వీడియోతో చంద్రబాబు డొల్లతనం బట్టబయలు అయింది. 

వీడియోలో ఏముందంటే..
పాదయాత్రలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో కే.కోటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్‌ పథకం స్థానంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మేం అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే నవరత్నాల్లో ఇది. నాన్నగారు కలలు కన్నట్టు ప్రతి అక్కా, ప్రతి చెల్లె లక్షాధికారి కావాలి. వారు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అక్కలు అనారోగ్యం కారణంగా, మరో కారణంగానో వారం రోజులు పనులకు వెళ్లకపోతే.. ​ వారు ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆ వర్గాల అక్కలకు తోడుగా ఉండాలని 45 ఏళ్లుకు పెన్షన్‌ ఇవ్వాలని నేను చెబితే.. 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్‌ ఏమిటని కొందరు వెటకారం చేశారు. వెటకారం చేస్తూ వారు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాందిపలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్‌ల ద్వారా పూర్తి పాదర్శకతతో, ఏమాత్రం అవినీతి తావు లేకుండా.. ప్రతి అక్కకు అందేవిధంగాచూస్తాం’ అని వైఎస్‌ జగన్‌ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఇందులో వక్రీకరణకు తావులేనప్పటికీ.. ఈ అంశాన్ని పట్టుకొని విలువైన సభా సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృధా చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ సభలో పేర్కొన్నారు. ఈ విషయంలోనూ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి పెద్ద మనిషి ఈ శాసనసభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి.. కీలక బిల్లులపై చర్చ చేపట్టాలని సభాపతిని కోరారు.

చదవండి: 
ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన!
అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!
అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement