కన్నతల్లి రుణం తీర్చుకుంటా!

Vice President Venkaiah Naidu Tour in PSr nellore - Sakshi

నెల్లూరు అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అనేక పథకాల మంజూరు  

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

నెల్లూరు సిటీ: నా సొంత ఊరు.. పెరిగిన ఊరు.. ఎదిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం కన్నతల్లి రుణం తీర్చుకోవడమేనని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఇరుకళ పరమేశ్వరి దేవస్థానం నుంచి స్వర్ణాలచెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్‌ నెక్లెస్‌ రోడ్డును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్‌ పథకం కింద రూ.30 కోట్లతో నెక్లెస్‌రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. ఇక్కడ మహనీయుల గుర్తుగా విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నెక్లెస్‌ రోడ్డుకు సంబంధించి 70 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. 

గ్రామాభివృద్ధి కోసమేఆ శాఖను తీసుకున్నాను
గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూశానని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపేందుకే గ్రామాభివృద్ధి శాఖ తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. తన కుమార్తె దీపా వెంకట్‌ నెల్లూరు నెక్ట్స్‌ కార్యక్రమం ద్వారా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమై నెల్లూరు అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నిర్వాహకురాలు దీపా వెంకట్, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, టీడీపీ నగర, రూరల్‌ ఇన్‌చార్జ్‌లు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాలప్రభాకర్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు,  కామినేని శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం
నెక్లెస్‌ రోడ్డు పనులు 50 శాతం కూడా పూర్తికాకుండా మంత్రి నారాయణ హడావుడిగా ప్రారంభోత్సవం చేయించడంపై నగర ప్రజలు విస్తుపోతున్నారు. నెక్లెస్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి హాజరైన ప్రజలు పనులు జరుగుతుండడం చూసి నోరెళ్లబెట్టారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి రెండు రోజులు ముందు నుంచి రేయింబవళ్లు  రోడ్డు, టైల్స్‌ పనులు చేశారు. హడావుడిగా పనులు చేయడంతో నాసిరకంగా నిర్మాణాలు సాగాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top