ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి మొయిలీ ధ్వజం

Veerappa Moily fires on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌వన్నీ వంచన రాజకీయాలేనని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి రహమాన్‌ ఖాన్, ఎంపీ నాసిర్‌ హుస్సేన్, కర్ణాటక మాజీ హోంమంత్రి రామలింగారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఆ సమయంలో నేనూ ఆ సమావేశంలో ఉన్నాను. నాకు సీఎం పదవి వద్దు. సీఎల్పీ ఇస్తే చాలన్నాడు. కానీ మాట నిలబెట్టుకోలేదు. వంచించడమే ఆయన విధానం. తెలంగాణ ప్రజలకు సైతం అనేక హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు’ అని మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌లో అభివృద్ధి ఊహించని రీతిలో జరిగిందని, టీఆర్‌ఎస్‌ రాగానే అది కుంటుపడిందన్నారు. ఐటీ సహా ఇతర అంశాల్లో బెంగళూరుతో హైదరాబాద్‌ పోటీ పడిందని, ప్రస్తుతం హైదరాబాద్‌కు ఆ ప్రభ లేదని చెప్పారు. కొత్త పరిశ్రమలేవీ హైదరాబాద్‌కు రాలేదన్నారు. 

అవినీతి, ఆత్మహత్యల్లో రెండో స్థానం..
తెలంగాణ రాష్ట్రం అవినీతి, ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని మొయిలీ అన్నారు. ఇక, నిరుద్యోగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో మొత్తం జనాభాలో 70 శాతం పేదరికంలోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఎక్కువ క్రైమ్‌ కేసులు నమోదవుతున్నాయని, దొంగతనాలు 17 శాతం, కిడ్నాప్‌లు 31 శాతం, రేప్‌ కేసులు 30 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. బీజేపీతో కుమ్మక్కై సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని, బీజేపీ తోడేలు పాత్ర పోషిస్తుంటే, టీఆర్‌ఎస్‌ గొర్రెల కాపరి పాత్ర వహిస్తోందని మొయిలీ ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top