కేసీఆర్‌పై పోటీ చేస్తే కేసులా? 

Vanteru Pratap Reddy Allegations On KCR - Sakshi

పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ఆరోపణలు

గజ్వేల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే పోలీసులు తనను, తన అనుచరులను కేసులతో వేధిస్తున్నారని గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. అసలు వీరు పోలీస్‌ డిపార్ట్‌మెంటా.. లేక కల్వకుంట్ల డిపార్ట్‌మెంటా అని ప్రశ్నించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు డిపాజిట్లు రావన్న భయంతోనే అన్ని రకాల అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న గజ్వేల్‌కు చెందిన ఓయూ విద్యార్థి మురళి శవయాత్రలో పాల్గొన్నందుకు తనపై నాలుగు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పక్షాన పోరాడినందుకు, ఎస్సైలు రామక్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఇప్పటివరకు తనపై 23 కేసులు పెట్టారని వాపోయారు. 

ఈసీ, పోలీసుల్లో చలనం లేదు 
కేసీఆర్‌ ఎక్కడ ఓడిపోతారన్న భయంతోనే మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో 45 రోజులుగా టెంట్లు వేసుకుని మరీ ప్రలోభాలకు తెరలేపారని వంటేరు ఆరోపించారు. నగదు, మద్యం ఏరులై పారుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సాక్ష్యాధారాలు సమర్పించినా ఈసీ, పోలీసుల్లో చలనం లేదని ఆవేదన చెందారు. ఈసీ, పోలీసులు పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోదాల పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా తన, తన అనుచరుల ఇళ్లపై దాడులు చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని వేధిస్తున్నారని, తన ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని వాపోయారు. 

తప్పుడు కేసులు సరికాదు: ఉత్తమ్‌ 
వంటేరుపై కేసులు, పోలీసుల వైఖరి విషయంలో డీజీపీ, ఎన్నికల సంఘం సరిగా వ్యవహరించడం లేదని ఉత్తమ్‌ మండిపడ్డారు. గజ్వేల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతాప్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి వేధించడం సరికాదని హితవు పలికారు. ఆయన ఇంటిపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎంకు పక్షపాతంగా వ్యవహరించే అధికారులు భవిష్యత్‌లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top