
హుజూర్‌నగర్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పొత్తులపై తమ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పొత్తులపై ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎలాంటి చర్చలు జరగలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఏఐసీసీ నాయకుల పరిధిలో మాత్రమే ఉంటాయని చెప్పారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అలవాటు పడ్డారని విమర్శించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు సైతం కోల్‌కతాకు ప్రైవేట్ జెట్‌లో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పరిస్థితులనుబట్టి పొత్తులు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఖమ్మంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.