ప్రైవేటు విద్యాసంస్థల మూత కేసీఆర్‌ ఘనతే: ఉత్తమ్‌

Utham Kumar Reddy Slams KCR In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఘనత కారణంగానే తెలంగాణాలో ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉత్తమ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సాధన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్‌ సీఎం అవ్వటంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఏర్పాటు ముందు ఒకలా ఏర్పాటు తర్వాత మరోలా అందరినీ దూరం పెట్టారని విమర్శించారు. చిన్న చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసి ఆదుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడాల్సింది పోయి అవమానపరిచి నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని అన్నారు.

 కోళ్ల ఫారాలలో విద్యాసంస్థలు నడుపుతారా అని కేసీఆర్‌ శాసనసభలో నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. పోలీసుల సోదాలతో వేధించారని, మీ భార్యలు కూడా మీకు ఓటెయ్యరని కేటీఆర్‌ను అవమానించారని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడతామని హామీ ఇస్తున్నామని, ఏ ఏడాది కా ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు విద్యాసంస్థల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ప్రమాద బీమా, గృహ వసతి కల్పిస్తామని తెలిపారు.

ప్రైవేటు విద్యాసంస్థల విద్యుత్‌  ఛార్జీలు డొమెస్టిక్‌ కింద మార్చుతామని తెలిపారు. బడ్జెట్‌ వీళ్ల అబ్బ సొమ్ముగా జేబుల నుంచి తీసి ఇస్తున్నట్లు దుర్మార్గంగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో విశ్వ విద్యాలయాలను పెద్ద ఎత్తున నిధులతో బలోపేతం చేసి గ్లోబల్‌ యూనివర్సిటీలుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేలా 100 రోజుల్లో 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top