కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ

Upendra Kushwaha Joins Grand Alliance In Bihar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్‌ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌, హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్‌ఎల్‌ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్‌ స్వాగతించారు. ‘బిహార్‌ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్‌(యూ), లోక్‌ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్‌ జనశక్తి(ఎల్‌జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్‌ పాశ్వాన్‌ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top