కాంగ్రెస్‌కు పంగ నామాలు పెట్టారు.. | unexpected victory for bjp in Surat | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పంగనామాలు పెట్టిన పటిదార్లు

Dec 19 2017 1:47 PM | Updated on Mar 18 2019 9:02 PM

unexpected victory for bjp in Surat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వస్త్ర ప్రపంచానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన గుజరాత్‌లోని సూరత్‌లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు, జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసిన సూరత్‌లో 16 సీట్లకు 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఎస్టీలకు కేటాయించడం వల్ల మాండ్వీ ఒక్క సీటును మాత్రం కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకో కలిగింది.

పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దాదాపు రెండు నెలలపాటు వస్త్రాల మిల్లులు, షాపులు మూతపడ్డాయి. లక్షలాది మంది యువకులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ బిల్లుతో తాము నష్టపోతున్నామంటూ సూరత్‌లో 65 వేల మంది వస్త్రవ్యాపారులు రోడ్డెక్కారు. వారిలో 90 శాతం మంది పాటిదార్లే ఉన్నారు. గతంలో తమకూ రిజర్వేషన్లు కావాలంటే భారీ ఉద్యమాన్ని నడిపిన ఈ పాటిదార్లు ఇప్పుడు హార్దిక్‌ పటేల్‌ నాయకత్వాన ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హార్దిక్‌ పటేల్‌ పిలుపుకు కాంగ్రెస్‌కు ఓటేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి అడుగడుగున పాటిదార్లు అడ్డంకులు సృష్టించారు. డిసెంబర్‌ 3వ తేదీన హార్దిక్‌ పటేల్‌ నిర్వహించిన బైక్‌ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే చాలు, వారిని అవహేళన చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎస్టీ స్థానంతో పాటు వరచ్చా, కటార్‌గామ్, కామ్‌రెజ్, సూరత్‌ నార్త్‌ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ పార్టీలే కాకుండా రాజకీయ విశ్లేషకులు భావించాయి. కొన్ని పోల్‌ సర్వేలు కూడా అలాగే అంచనా వేశాయి. మరి ఎందుకు కాంగ్రెస్‌ను కాదని ఓటర్లు, అంటే పాటిదార్లు బీజేపీకి పట్టంకట్టారు. ‘మేం చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు’ అని పాటిదార్ల అనామత్‌ ఆందోళన్‌ సమితి సూరత్‌ కన్వీనర్‌ అల్పేష్‌ కత్రియా వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రభుత్వం పట్ల ఇక్కడి ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని, అయినప్పటికీ బీజేపీ విజయానికి కారణాలేమిటో తమకు అంతుచిక్కడం లేదని ఆయన చెప్పారు. ‘సూరత్‌లో ఎన్నికల ఫలితాలు అనూహ్యం. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను ప్రచారానికి కూడా అనుమతించలేదు. మరి చివరి నిమిషంలో వారినే ఎందుకు గెలిపించారో అర్థం కావడం లేదు’ అని సూరత్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం వల్లనే బీజేపీ విజయం సాధించిందని పాటిదార్ల యువ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ ఇంతకుముందే ఆరోపించిన విషయం తెల్సిందే.

సూరత్‌ ఫలితాలను చూసి తాను కూడా ఆశ్చర్యపడ్డానని అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నాలుగైదు సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుందని భావించానని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. పాటిదార్లు తమ నరనరాన పేరుకుపోయిన హిందూత్వ ఏజెండాను వదులుకోలేక పోయారని, అందుకనే వారు ఎంత కోపం, వ్యతిరేకత ఉన్నా బీజేపీకే ఓటేసి ఉంటారని ఆయన అన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను పాటిదార్లే దెబ్బతీశారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement