ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా?

TPCC Chief Utham Kumar Reddy And Bhatti Vikramarka Fire On KCR In Hyderabad - Sakshi

సీఎం కేసీఆర్‌ది అగ్రకుల అహంకారం

ఫిరాయింపు ఎమ్మెల్యేల విలీనం నీచం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం

8న ఇందిరా చౌక్‌లో భట్టి నేతృత్వంలో దీక్ష చేస్తాం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నీచంగా, వికృతంగా, గలీజు రాజకీయాలు చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రహస్య ప్రదేశంలో విలీన ప్రక్రియ పిటిషన్‌ తీసుకొని, మూడు గంటల్లోనే ప్రక్రియను ముగించారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా అని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతో అనైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న భ్రష్టు రాజకీయాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. గురువారం రాత్రి విలీన ప్రక్రియకు సంబంధించి బులెటిన్‌ వెలువడిన అనంతరం ఆయన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలతో కలసి గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని చూడటం నీచమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని ఎంత తొక్కితే అంతగా బలపడతామని, చరిత్ర ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నటికైనా టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది కాంగ్రెస్‌ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టిన స్పీకర్‌... ఫిరాయింపు ఎమ్మెల్యేలు విలీన లేఖ ఇచ్చిన గంటల్లోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఉదయం నుంచి స్పీకర్‌ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. కాంట్రాక్టుల సొమ్ము చెల్లిస్తామని ఉపేందర్‌రెడ్డిని, రూ. 26 కోట్ల పరిహారం ఇస్తామని హర్షవర్ధన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న టీఆర్‌ఎస్‌... రోహిత్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించి పార్టీలోకి రప్పించుకుందని ఉత్తమ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న అక్రమాలను శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నించ కూడదని ఫిరాయింపులు చేస్తున్నారా లేక కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు పంచాయితీ వస్తే ఎమ్మెల్యేలు హరీశ్‌ దగ్గరకు వెళ్తారన్న భయంతో ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ విలీన ప్రక్రియపై హైకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ వెలువడే తీర్పునుబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలు జరిగాయో రుజువులతో సహా అక్కడే నిరూపిస్తామన్నారు. విలీన ప్రక్రియకు నిరసనగా ఈ నెల 8న ఇందిరా చౌక్‌లో భట్టి విక్రమార్క నేతృత్వంలో సేవ్‌ డెమోక్రసీ పేరుతో 36 గంటలపాటు దీక్ష చేస్తామని వెల్లడించారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ: భట్టి 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం నేరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని, ఒకవేళ పార్టీ మారితే వారిని అనర్హులుగా ప్రకటించాలి తప్ప పార్టీ మారిన వారి నుంచే విలీనపత్రం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విధానం యావత్‌ దేశం పాకితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమయం ఇవ్వకుండా, అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలని స్పీకర్‌ ఆదేశించడం దారుణమన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడానికే విలీనం చేశారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top