చంద్రబాబు వల్లే  హోదా వెనక్కు

Tirupati MP Varaprasad Rao Comments On Chandrababu - Sakshi

ప్రజల ఆకాంక్ష కోసం పదవుల త్యాగం

తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు 

నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం

నెల్లూరు(సెంట్రల్‌) : ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆందదప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ వెనక్కు పోయిందని తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు వెలగపల్లి వరప్రసాద్‌రావు విమర్శించారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణదీక్ష చేసిన అనంతరం మొదటి సారిగా గురువారం రాత్రి ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. ఎంపీ వరప్రసాద్‌కు జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ రైల్వేస్టేషన్‌లో ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రావు మాట్లాడుతూ నాలుగేళ్లుగా దొంగనాటకాలు ఆడి, బీజేపీతో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు.

హోదా విషయంపై సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అదేవిధంగా తమ రాజీనామాలపై హేళనగా మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా కోసం దీక్ష చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే మోసంతోనే దొంగ దీక్షకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు. తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో, ప్రజల ఆకాంక్ష కోసం పదవులను త్రుణపాయంగా వదులుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాల ద్వారా హోదాను సాధించుకుంటామన్నారు.

తలుపులు మూసిన తరువాత ఆందోళనా?
తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో తలుపులు మూసి వేసిన తరువాత ఆందోళన అంటూ బయట నాటకాలు ఆడారని ఆరోపించారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ జరుగుతున్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. తాము హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దాదాపుగా 100 మందికిపైగా ఎంపీలు తమకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ ఇంటి ముందు తాము ఆందోళన చేశామని టీడీపీ ఎంపీలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

వాళ్లు చేసింది ప్రధాని ఇంటి ముందు కాదని, ఎక్కడో చేసి అనుకూల మీడియా ద్వారా ప్రధాన మంత్రి ఇంటి ముందు అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో హోదా కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా తమ రాజీనామాలు స్పీకర్‌ ఫార్మెట్‌లోనే ఇచ్చామన్నారు. ఆమరణ దీక్ష భగ్నం చేసిన తరువాత కూడా రాష్ట్రపతిని కలిశామని పేర్కొన్నారు.  

ఎంపీని కలిసిన ఎమ్మెల్యే కాకాణి  
రాజీనామా చేసిన తరువాత నెల్లూరుకు మొదటిసారిగా వచ్చిన తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు వి.వరప్రసాద్‌రావును వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హోటల్‌ అనురాగ్‌లో కలిశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన ఆమరణ దీక్ష ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. హోదా పోరాటంలో ప్రతి ఒక్కరం భాగస్వాములుగా  ముందుకు పోతామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top