అందోలుపై ఆశలు

Three People Compete To Andole Constituency - Sakshi

టికెట్‌ వేటలో మరో ఇద్దరు నేతలు

కొత్తగా బరిలోకి బక్కి వెంకటయ్య!

స్థానిక నినాదంతో క్రాంతికిరణ్‌..

ధీమాగా బాబూమోహన్‌ వర్గీయులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి  : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందోలు టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2014 సా«ధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన బాబూమోహన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఆయన వైఖరితో పార్టీ నియోజకవర్గ నేతలు కొందరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తామంటూ ఇద్దరు నేతలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి దక్కుతుందనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 

అందోలు అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 సాధారణ ఎన్నికల వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ వరుస విజయాలు నమోదు చేసిన ఈ నియోజకవర్గంలో 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 1998 ఉప ఎన్నికతో పాటు 1999 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్‌   సాధించిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ విజయం సాధించారు.

ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరుస ఓటమి చవిచూసిన ఆయన 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నాలుగేళ్లకు పైగా పదవీ కాలం పూర్తి చేసిన బాబూమోహన్‌ వైఖరితో కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు విభేదిస్తున్నారు. జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డి.బి.నాగభూషణం, సాయికుమార్‌ వంటి ఒకరిద్దరు నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో వీరికి మరికొందరు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, కొందరు నేతలు కూడా తోడైనట్లు సమాచారం. అసంతృప్త నేతల్లో కొందరు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో సత్సబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ బీబీ పాటిల్‌ చాలా కాలంగా అందోలు నియోజకవర్గంలో పర్యటించకపోవడం ఎమ్మెల్యే, ఎంపీ నడుమ నెలకొన్న విభేదాలకు తార్కాణంగా చెబుతున్నారు. 

బరిలోకి కొత్త ముఖాలు

అందోలు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య తాజాగా తెరమీదకు వస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలపై తమదైన పట్టుకలిగిన మాజీ ఎంపీ మాణిక్‌ రెడ్డి వర్గం బక్కి వెంకటయ్యకు మద్దతు పలుకుతున్నట్లు తెలి సింది. మాణిక్‌ రెడ్డి సోదరుడు జైపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నట్లు సమాచారం.

గతంలో దుబ్బాక జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బక్కి వెంకటయ్యకు సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం కూడా ఉంది. జోగిపేటలో సుమారు రెండు దశాబ్దాలుగా వ్యాపార సంబంధాలు కలిగి ఉండడంతో స్థానికులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న బక్కి వెంకటయ్య ఇప్పటికే అంతర్గతంగా స్థానిక నేతలను కలుస్తూ, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా బాబూమోహన్‌ ఉండడంతో ఎన్నికల నాటికి బలంగా తెరమీదకు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయంలో ఆర్‌సీపురం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన జర్నలిస్టు సంఘం నేత సీహెచ్‌ క్రాంతికిరణ్‌ కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. అందోలు టికెట్‌ స్థానికులకే అనే నినాదాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఆయన మద్దతుదారులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

2009 ఎన్నికల్లోనూ క్రాంతికిరణ్‌ టికెట్‌ ఆశించినా దక్కక పోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చే శారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇటీవల కొందరు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో సమావేశమైనట్లు సమాచారం. బాబూమోహన్‌ వర్గీయులు మాత్రం ఆయనకు టికెట్‌ దక్కదనే ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలు అందోలు నియోజకవర్గంలో పకడ్బంధీగా అమలవుతుండటాన్ని ప్రస్తావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top