30 ఏళ్లుగా ఒక్క ముస్లిం నెగ్గలేదు

There is No Muslim Leader Won From Thirty Years in Gujarat - Sakshi

ఎప్పుడో 1984 ఎన్నికల్లో.. ఆ రాష్ట్రం నుంచి ముస్లిం అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతే.. ఆ తర్వాత ఇప్పటి దాకా ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా జాతీయ పార్టీల తరఫున (కాంగ్రెస్, బీజేపీ) అక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నిక కాలేదు. 30 ఏళ్లుగా లోక్‌సభకు జాతీయ పార్టీల నుంచి ఒక్క ముస్లిం కూడా ఎన్నిక కాని ఆ రాష్ట్రం గుజరాత్‌. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ జనాభాలో 9.5 శాతం ముస్లింలు ఉన్నారు. 1974లో అహ్మద్‌పటేల్‌ బరుచ్‌ స్థానం నుంచి గెలిచారు. 1989 ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. గుజరాత్‌ రాష్ట్రం ఆవిర్భవించాక 1962లో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి జొహారా చావ్డా నుంచి గెలిచారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ముస్లింలు అహ్మద్‌ పటేల్‌ (బరుచ్‌), ఇషాన్‌ జాఫ్రీ (అహ్మదాబాద్‌) మాత్రమే గెలుపొందారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ముస్లింలు లోక్‌సభకు వెళ్లడం అదే మొదటి, చివరిసారి. గుజరాత్‌లో ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం బరుచ్‌.

ప్రస్తుతం అక్కడున్న 15.64 లక్షల ఓటర్లలో 22.2 శాతం ముస్లింలే. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బరుచ్‌లో ఎనిమిది మంది ముస్లింలను నిలబెట్టింది. వారిలో అహ్మద్‌ పటేల్‌ ఒక్కరే గెలిచారు. అహ్మద్‌ పటేల్‌ 1977, 1982, 1984 ఎన్నికల్లో వరసగా ఇక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి కేవలం ఏడుగురు ముస్లిం అభ్యర్థులు మాత్రమే జాతీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా కాంగ్రెస్‌ తరఫునే నిలబడ్డారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 334 మంది పోటీచేశారు. వారిలో 67 మంది ముస్లింలే. అయితే, ఈ 67 మందిలో 66 మంది ఇండిపెండెంట్లుగానో, ఎస్పీ వంటి ఇతర పార్టీల తరఫునో పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఒక్కరే మక్సద్‌ మీర్జా నిలబడ్డారు. 1962 నుంచి 2014 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో 3,154 మంది పోటీ చేస్తే వారిలో జాతీయ పార్టీల తరఫున పోటీ చేసిన ముస్లింలు 15 మందే.వీరిలో ఏడుగురు కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు.అయితే, రాష్ట్రంలో బీజేపీ తరఫున ఇంత వరకు ఒక్క ముస్లిం కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.రాష్ట్రంలో ముస్లింలు సామాజికంగానే కాక రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. 2002 అల్లర్ల తర్వాత వారి ప్రాతినిధ్యం మరీ తగ్గిపోయింది’ అన్నారు సామాజిక శాస్త్రవేత్త కిరణ్‌ దేశాయ్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top