పోలింగ్‌ ప్రశాంతం

Telangana ZPTC And MPTC Elections Peaceful n Warangal - Sakshi

ఆత్మకూరు(పరకాల): జిల్లాలో సోమవారం మొదటి విడత పోలింగ్‌ ప్రశాతంగా ముగిసింది. తొలి దశలో ఐదు జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేయగా నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  మొదటి విడతలో 80.67శాతం పోలింగ్‌ నమోదు కాగా 1,35,046మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బరిలో 201 మంది అభ్యర్థులు..
తొలి విడత ఎన్నికల బరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 201 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదు జెడ్పీటీసీలకు 32 మంది, 58 ఎంపీటీసీలకు 169 మంది బరిలో ఉన్నారు. వర్దన్నపేట జెడ్పీటీసీకి 10 మంది, పర్వతగిరి, సంగెం, దుగ్గొండి మండలాల్లో ఆరుగురి చొప్పున, నర్సంపేటలో నలుగురు బరిలో ఉన్నారు.

354 పోలింగ్‌ స్టేషన్లు
జిల్లాలో తొలి దశలో 354 పోలింగ్‌ స్టేషన్లలో 2,451 మంది సిబ్బందిని నియమించారు. పీఓలు 425, ఏపీఓలు 425, ఓపీఓలు 1,601 మందిని నియమించారు. వీరంతా విధుల్లో పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌ 
సంగెం: సంగెం మండలంలోని కాపులకనిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని  పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ముండ్రాతి హరిత సందర్శించి పరిశీలించారు.   ఈ సందర్భంగా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ సరళితో పాటుగా పోలింగ్‌ కేంద్రంలోని వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీఓ మట్టపల్లి సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, ఆర్డీఓ మహెందర్‌జీ, తహసీల్దార్‌ కొండాయి లక్ష్మిపతి తదితరులున్నారు. అలాగే మామునూర్‌ ఏసీపీ శ్యాంసుందర్‌ కాపులకనిపర్తి, కాట్రపల్లి, కుంటపల్లి, గవిచర్ల, తీగరాజుపల్లి, తిమ్మాపురం, ఎల్గూర్‌రంగంపేట, మొండ్రాయి, పల్లారుగూడ, చింతలపల్లిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.
 
పర్వతగిరి: మండలంలోని కొంకపాక, గోపనపల్లి, అనంతారం పోలింగ్‌ కేంద్రాలను  జిల్లా కలెక్టర్‌ ముండ్రాతి హరిత సోమవారం సందర్శించారు. పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన వీల్‌ చైర్‌ను పరిశీలించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ చూడాలని పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముగిసిన మూడో విడత ఉపసంహరణ 
జిల్లాలో 53 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను గురువారం వరకు స్వీకరించారు. నెక్కొండ మండలం వెంకటాపురం ఎంపీటీసీ ఏకగ్రీవమైంది. 52 ఎంపీటీసీలకు 157మంది, 5 జెడ్పీటీసీ స్థానాలకు 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతరం అభ్యర్థులను గుర్తులను కేటాయించారు. మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చెన్నారావుపేటలో 11 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది, జెడ్పీటీసీకి 4,  నెక్కొండలో 16 ఎంపీటీసీలకు 50 మంది బరిలో ఉన్నారు.

నెక్కొండ మండలంలోని వెంకటాపురం ఎంపీటీసీ అభ్యర్థి గుండారపు అపర్ణ రవీందర్‌రావు(కాంగ్రెస్‌) ఏకగ్రీవమైంది. ఆత్మకూరు 9 ఎంపీటీసీ స్థానాలకు 28 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4గురు, దామెర మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 20 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4, గీసుకొండ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు 26 మంది, జెడ్పీటీసీకి 7 గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top