రికార్డు స్థాయిలో ఓటింగ్‌  | Bihar Voters for Historic Turnout in Phase I, says CEC Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ఓటింగ్‌ 

Nov 7 2025 5:04 AM | Updated on Nov 7 2025 5:21 AM

Bihar Voters for Historic Turnout in Phase I, says CEC Gyanesh Kumar

బిహార్‌లో తొలి దశ పోలింగ్‌లో 64.66 శాతం నమోదు  

రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం వెల్లడి  

ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌  
 

పట్నా: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 64.66 శాతం ఓటింగ్‌ రికార్డు కావడం గమనార్హం. ఓటర్లు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్‌ బూత్‌ల ముందు బారులు తీరి కనిపించారు. తొలి దశలో భాగంగా 18 జిల్లాల్లోని మొత్తం 121 శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్‌ నిర్వహించారు. 

3.75 కోట్ల మంది ఓటర్లలో 64.66 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. పండుగ వాతావరణంలో తొలి దశ పోలింగ్‌ జరిగినట్లు పేర్కొంది. 45,341 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. అత్యధికంగా ముజఫర్‌పూర్‌ జిల్లాలో 70.96 శాతం, సమస్తీపూర్‌లో 70.63 శాతం, మాధేపురాలో 67.21 శాతం, వైశాలీలో 67.37 శాతం, సహర్సాలో 66.84 శాతం, ఖగారియాలో 66.36 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

రాష్ట్రంలో అత్యధిక శాతం ఓటింగ్‌ నమోదు కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. బిహార్‌ ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సంఘం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌ శాతంపై శుక్రవారం పూర్తి స్పష్టత రానుంది. తొలి దశలో భాగంగా మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌కుమార్‌ సిన్హాతోపాటు పలువురు మంత్రులు తొలి దశ ఎన్నికల్లో పోటీకి దిగారు.  

ఎస్‌ఐఆర్‌ తర్వాత ఎన్నికలు  
బిహార్‌లో 1951–52లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 42.6 శాతం ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 62.57 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. 2020 నాటి ఎన్నికల్లో కోవిడ్‌–19 ప్రభావం వల్ల ఓటింగ్‌ శాతం 57.29కు పరిమితమైంది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) పూర్తి చేసిన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి బిహార్‌పై కేంద్రీకృతమైంది. రెండో దశలో భాగంగా మిగిలిన 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ఈ నెల 11న జరుగనుంది.  

ఓటేసిన ప్రముఖులు  
తొలి దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తదితరులు ఓటు వేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌ సహా ఇతర కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.     

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి  
తొలి దశ పోలింగ్‌ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. లఖీ సరాయ్‌ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హా కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు.  బక్సర్, ఫతుహా, సూర్యగఢ్‌ తదితర ప్రాంతాల్లో కొన్ని కేంద్రాల్లో ఓటింగ్‌ను జనం బహిష్కరించారు. మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు బలం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగా ఓటింగ్‌ను తగ్గించారని ఆర్జేడీ ఆరోపించింది.  

పెనంపై రొట్టెను తిరగేయకపోతే..       
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిదే విజయమని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయబోతున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పెనంపై రొట్టెను తిరగేయకపోతే మాడిపోతుందని తెలిపారు. ఎన్డీయే 20 ఏళ్లుగా అధికారంలో ఉందని గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. నూతన బిహార్‌ నిర్మాణానికి తేజస్వీ ప్రభుత్వం రావాల్సిందేనని తేలి్చచెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement