పైకి ధీమా.. లోలోన భయం!

Telangana Lok Sabha Elections: Parties Worried About Mp Elections - Sakshi

రైతుల బరితో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌

దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ ఎన్నికలు     

సాక్షి, జగిత్యాల: నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో గెలుపుపై అభ్యర్థులు లోలోన భయపడుతు​న్నా.. పైకి మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ.. ఎన్నడూ లేని విధంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం.. అందులో అత్యధికం 178 మంది రైతులే ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో భయం మొదలైంది. వీరి పోటీ ఎవరి ఓట్లకు ఎసరు పెడుతుందనే ఆందోళన మొదలైంది. పదిహేను రోజులపాటు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యలైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరపై చర్చ జరగాలనే ఉద్దేశంతో అత్యధిక సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఏదైతే లక్ష్యంతో వారు నామినేషన్లు వేశారో.. అది దాదాపు విజయవంతంగా చేరుకున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం రైతుల ప్రధాన డిమాండ్లు అయిన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలపై హామీలు ఇచ్చారు. అయితే నిజామాబాద్‌ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న రైతుల ఓట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల చీలికపై కూడా భయం పట్టుకుంది.  

అందరి దృష్టి వారిపైనే..  
తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌ బరిలో నిలవాలని పసుపు, ఎర్రజొన్న రైతులు సంకల్పించుకున్నారు. అనుకున్నట్లుగానే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. రైతుల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం, ఉపసంహరించుకోకపోవడంతో ఒకదశలో ఎన్నిక వాయిదా పడుతుందని.. పేపరు బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించ వచ్చనే చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఎం3 తరహా ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహిస్తామని చాలెంజ్‌గా తీసుకుంది. దీంతో ఒకటికి బదులుగా 12 ఈవీఎంల బ్యాలెట్‌ యూనిట్‌ ద్వారా ప్రత్యేకమైన ఎన్నికలు ఇక్కడ జరుగబోతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులంతా తమ ఓట్లు తమకే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మంగళవారం ఆర్మూర్‌లో రైతు ఐక్యత వేదిక ద్వారా తీర్మానించుకున్నారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు కాకుండా అభ్యర్థులుగా ఉన్న రైతులకే తమ ఓట్లు వేయాలని ప్రకటించారు. వీరి నిర్ణయంతో ఎవరి ఓట్లకు గండి పడనుందోనని టెన్షన్‌ మొదలైంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top