కౌంట్‌ డౌన్‌! 

Telangana Lok Sabha Elections Counting Arrangements - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సర్వే అంచనాలు దగ్గర పెట్టుకుని ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. ప్రతిష్టాత్మక చేవెళ్ల లోక్‌సభలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్‌ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క కాషాయదళం కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. చేవెళ్ల స్థానానికి పోలింగ్‌ శాతం మరీ తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. 55 శాతం మించకపోవడంతో ఆ ప్రభావం ఏ పార్టీపైన పడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు ఆందోళనకు గురవుతున్నారు.
 
ముగ్గురిలోనూ గెలుపు ధీమా 
చేవెళ్ల లోక్‌సభకు 23 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన,  చిన్నాచితక పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ బరిలో నిలిచారు. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రంజిత్‌ రెడ్డి విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నిక ఒకరకంగా ఆయన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లాకు చెందిన నేతలను కాదని స్థానికేతరుడునైన రంజిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ అవకాశమిచ్చారు.

ఈయన గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఒకరకంగా మహేందర్‌రెడ్డి రాజకీయ పరపతి.. రంజిత్‌రెడ్డి విజయంపై ఆధారపడి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నట్లే. రంజిత్‌రెడ్డి గెలిస్తే పార్టీలో మహేందర్‌రెడ్డి స్థానం పదిలమే. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మూడు నాలుగు నియోజకవర్గాలు.. కొండాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాండూరు, చేవెళ్ల, వికారాబాద్‌ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు అధికంగా ఓట్లు దక్కే వీలుందని నేతలు భావిస్తున్నారు.

మిగతా పార్టీల్లో కంటే ఈయన అభ్యర్థిత్వం ముందే ఖరారు కావడం వల్ల పకడ్బందీ ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో దిగారు. ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే సమయం దక్కింది. అలాగే బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌రెడ్డి గెలుపు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీనికి తోడు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, శంషాబాద్‌కు ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌షా రావడం మరింత కలిసి వస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద ఏ అభ్యర్థి.. ఏ మేరకు ఓటర్లకు దగ్గరయ్యారన్నది 23న తేలనుంది.
 
ఎమ్మెల్యేల్లో ఆందోళన  
చేవెళ్ల లోక్‌సభ ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ను పుట్టిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒకరకంగా తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తేనే.. సదరు ఎమ్మెల్యేలపై సీఎం దృష్టిలో సదాభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఆయా సెగ్మెంట్లలో మెజార్టీ తగ్గితే గులాబీ దళపతికి తాము ఏం సమాధానం చెప్పుకోవాలోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లు వినికిడి. ప్రధానంగా మహేశ్వరంలో కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌కు దగ్గరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సమయంలో ‘మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకురండి’ అని వీరికి సీఎం చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఎటు వైపు ఉంటారోనని సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top