కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి.. సీసీ కెమెరాలతో లైవ్‌ కౌంటింగ్‌

All Arrangements Complete For Counting Of Huzurnagar Bye Elections - Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ​ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు.  జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, కేంద్ర పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. అలాగే వీటి పరిసరాలన్నీ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ ఫుటేజీ మొత్తం అభ్యర్థులు లైవ్‌లో 24 గంటలు చూసుకునేలా సౌకర్యం కల్పించారు. 

సీసీ కెమెరాల ద్వారా ప్రసారం
రేపు(గురువారం) జరగబోయే కౌంటింగ్‌లో మైక్రో అబ్జార్వర్‌, సూపర్వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్వైజర్‌తో పాటు మరో ముగ్గురు సహాయకులు ఉండనున్నారు. అలాగే రిటర్నింగ్‌ అధికారితోపాటు జిల్లా కలెక్టర్‌, కేంద్రం నుంచి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ సాగనుంది.  ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా ప్రసారం చేసే వెసులుబాటును ఎన్నికల అధికారులు కల్పించారు. రేపు ఉదయం 6 గంటలలోపు అన్ని పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్‌ల నియామక ప్రక్రియను పూర్తి చేసుకొని 8 గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ రోజు అభ్యర్థులు, ఏజెంట్‌ల సమావేశంలో మాక్‌ కౌంటింగ్‌ నిర్వహిస్తారు. 

ఓట్ల లెక్కింపు రోజు ప్రత్యేకంగా జారీ చేసిన పాస్‌లు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.  పోలైన 2 లక్షల 754  ఓట్లను, అదే విధంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మండలానికి 5 పోలింగ్‌ కేంద్రాల చొప్పున వీవీప్యాట్‌లో ఉన్న ఓట్లను కూడా అధికారులు లెక్కించనున్నారు. ఈ కౌంటింగ్‌ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తోపాటు పోలీసు యాక్ట్‌ 30ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top