ఏకగ్రీవ నజరానా ఏదీ 

New Panchayat Funds Break In Telangana - Sakshi

బషీరాబాద్‌: జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలు ప్రభుత్వ నజరానా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ డబ్బులు వస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని ప్రజాప్రతినిధులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మధ్య కుదిరిన అంగీకారం ప్రభుత్వానికి లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించింది. ఒక్కో జీపీలో ఎన్నికల నిర్వహణకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అయితే జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 71 జీపీలు సంపూర్ణంగా యునానిమస్‌ అయ్యాయి. మొత్తం 460 వార్డులు కూడా ఏకగ్రీవం సాధించాయి. తద్వారా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదా కావడంతో పాటు అభ్యర్థులకు ఖర్చు బెడద తప్పింది. 

అధికార పార్టీ చొరవ.. 
జిల్లాలోని 565 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు అన్ని అధికారాలు కట్టబెట్టడంతో ఆ పదవికోసం గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పంచాయతీ బరిలో మండల స్థాయి రాజకీయ నేతలతో పాటు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు వర్గాల వారు రంగంలోకి దిగడంతో ఎన్నికలు ఖరీదుగా మారాయి. జిల్లాలో అర్బన్‌ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న పంచాయతీల్లో ఎలాగైన సర్పంచ్‌ పీఠం దక్కించుకోవాలని కొందరు అభ్యర్థులు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. మరీ ముఖ్యగా తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి పట్టణాలకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలు, గనుల ప్రాంతాల జీపీల్లో తీవ్ర పోటీ కొనసాగింది. ఇదిలా ఉండగా మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు రెబల్స్‌గా పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు.. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జిల్లాలోని 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో కూడా చేరాయి. జిల్లాలో మొదటి విడతలో 34, రెండో విడతలో 18, తుది విడతలో 23 పంచాయతీలు యునానిమస్‌ అయ్యాయి.
 
71 పంచాయతీలకే నజరానా  
జిల్లాలో మూడు విడతల్లో 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 71 పంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు మొత్తం పోటీలేకుండా గెలపుపొందారు. దీంతో వీటిని మాత్రమే సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలుగా గుర్తించిన ప్రభుత్వం.. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున పంచాయతీ ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు జీపీలకు ప్రోత్సాహక నిధులు అందలేదు.
 
అభివృద్ధికి ఊతం.. 
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10 లక్షల నజరానా అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఈ నిధులతో పాటు జెడ్పీ నుంచి మరో రూ.10 లక్షలు ఇస్తామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి తాండూరులో ప్రకటించారు. ఇలా మొత్తం రూ.20 లక్షల నిధులు ఏక కాలంలో పంచాయతీలకు అందితే వేగంగా అభివృద్ధి అవకాశం ఉంది. ఇటీవల ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏకగ్రీవ ప్రోత్సాహకం రాకపోవడంపై గ్రామ ప్రథమ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు.

అభివృద్ధి కోసం ఏకమయ్యాం
ప్రభుత్వం మా తండాను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. గతంలో ఉమ్మడి జీపీగా ఉన్నప్పుడు తండాలకు సర్పంచ్‌గా అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతా ఏకమయ్యాం. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో సర్పంచ్‌తో పాటు వార్డుల సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, జెడ్పీ నుంచి రూ.10 లక్షలు వస్తే ఊరిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – రవి, సర్పంచ్, కొత్లాపూర్‌(బి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top