కాంగ్రెస్‌లో మిగిలేది ‘ఆ ముగ్గురే’

Telangana Congress Legislative Council Merge in TRS soon, rega kantarao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ‘ఆ ముగ్గురు’ మాత్రమే మిగులుతారని, మిగిలిన వారంతా టీఆర్‌ఎస్‌లోకే వస్తారని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని, విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారం కోసం వచ్చామని తెలిపారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యాయం. మా ప్రాంతం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం... పెండింగ్‌ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నాం. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభపక్షం విలీనం కచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్‌ మెజారిటీ ఎమ్మెల్యేలం మేమే ఉన్నాం. ఇప్పటికే పది మంది కలిసి వచ్చాం. ఒకటిరెండు రోజుల్లో అది కూడా జరుగుతుంది. విలీనం ఖాయం. ఎప్పుడనేది అందరికీ కంటే ముందుగా మీడియాకే చెబుతాం. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారు. సీఎం కేసీఆర్‌ కేసీఆర్, కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో, దేశంలోనే బలమైన రాజకీయశక్తిగా ఏర్పడుతుంది. కాంగ్రెస్‌లో ఆ ముగ్గురే మిగులుతారు. మిగిలిన వారంతా టీఆర్‌ఎస్‌లోకి వస్తారు’ అని అన్నారు.

టీఆర్‌ఎస్‌ బీపారాల పంపిణీ...
స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాలను పంపిణీని టీఆర్‌ఎస్‌ మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించిన వారికి సైతం టీఆర్‌ఎస్‌ బీఫారాలను ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీకి వచ్చారు. వారి నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్‌ఎస్‌ బీఫారాలను తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డిని కలిసి బీఫారాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభపక్షం విలీనం ప్రక్రియ కోసమే ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీనం ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆహ్వానించినట్లు తెలిసింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top