కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

Telangana Congress Leaders Worried For Election Results - Sakshi

ఫలితాల తేదీ సమీపిస్తున్నకొద్దీ పార్టీ నేతల్లో పెరుగుతున్న ఉత్కంఠ

అగ్నిపరీక్షలో నిలిచే ముఖ్యనేతలు ఎవరోనని ఆందోళన

జాబితాలో ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్, రేణుక, యాష్కీ, పొన్నం

పైకి ధీమాగా ఉన్నా లోలోపల ఆందోళనలో నేతలు, కార్యకర్తలు

నేటి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూపు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరవైఫల్యం తర్వాత కీలక నేతలంతా బరిలోకి దిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న పార్టీలో ఆందోళన ఎక్కువవుతోంది. పార్టీలోని రాష్ట్ర ముఖ్య నేతలం దరికీ అగ్నిపరీక్షగా మారిన ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? సానుకూలంగా ఉంటే ఏం జరగబోతోంది? ప్రతికూలంగా ఫలితాలు వస్తే పార్టీలో ఎలాంటి మార్పులుంటాయి? అసలు పార్టీ మనుగడ, భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్నలు నాయకులతో పాటు పార్టీ శ్రేణులను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పోలింగ్‌ సరళిని బట్టి ఐదారు స్థానాల్లో పార్టీకి మంచి ఓటింగ్‌ జరిగిందని భావిస్తున్నా.. నేడు వెలువడనున్న ఎగ్జిట్‌పోల్‌ ఫలితా లు ఏం చెబుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

చావో.. రేవో!
ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చావో రేవో సమస్యగా పరిణమించాయి. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురవడం.. పార్టీ నేతలంతా వలసబాట పడుతుండడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించాలంటే.. లోక్‌సభ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. దీనికితోడు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్రంలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు ఏఐసీసీ స్థాయి నేతలుగా చెలామణి అవుతున్న రేణుకాచౌదరి, మధుయాష్కీగౌడ్, కేంద్ర మాజీ మంత్రి మల్లురవి లాంటి నేతల భవితవ్యంపై ఈ ఎన్నికలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన ఈ నేతల్లో ఎవరు విజయబావుటా ఎగరేస్తారు? ఎవరు తేలిపోతారనేది కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్‌ నాయకత్వ పటిమకు అగ్నిపరీక్షగా మారింది. ఈ ఫలితాలను బట్టే రాష్ట్ర కాంగ్రెస్‌లో మార్పులుంటాయనే చర్చ కూడా ఈ ఉత్కంఠకు కారణమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజామోదం వచ్చిన వ్యక్తికే పార్టీ పగ్గాలిస్తారన్న అంచనాలు కూడా ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్‌ సరళిని బట్టి మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే అంచనాలు, ఐదారు స్థానాల్లో తమ కన్నా బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే లెక్కలు ఈ ఆందోళనకు కారణమవుతు న్నాయి. అయితే, నల్లగొండ, భునవగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్‌ స్థానాలపై ఆశలు సన్నగిల్లకపోయినా వీటిలో ఎన్ని స్థానాలు గెలుస్తామన్న దానిపై పార్టీ అంతర్గత సర్వేల్లోనూ స్పష్టత రావడంలేదు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top